శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (11:53 IST)

దీపతో కలిసి పనిచేసేందుకు సై.. జయలలిత మేనకోడలిగా ఆమెకు ఆ అర్హత ఉంది: ఓపీ

దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీపతో కలిసి పనిచేసేందుకు సై అని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అన్నారు. దీప తమతో కలిసి వస్తానంటే తప్పకుండా గౌరవిస్తామని మీడియా ప్రతినిధుల సమావేశంలో ఓపీ తెలిపా

దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీపతో కలిసి పనిచేసేందుకు సై అని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అన్నారు. దీప తమతో కలిసి వస్తానంటే తప్పకుండా గౌరవిస్తామని మీడియా ప్రతినిధుల సమావేశంలో ఓపీ తెలిపారు. జయలలిత మేనకోడలిగా ఆమెకు ఆ అర్హత ఉందనీ... ఆమెకు అండగా ఉంటామన్నారు. తాను ఈ స్థాయికి వచ్చేందుకు అమ్మే కారణమనీ.. ఆమె ఆత్మ తనను ఎప్పటికీ నడిపిస్తుందన్నారు. 
 
ప్రజల మనోభావాలకు తగిన విధంగా ఏఐఏడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకోవాలని తమ పార్టీ సహచర ఎమ్మెల్యేలను కోరారు. శశికళ పార్టీ బాధ్యతలు చేపట్టినప్పటికీ.. ఇప్పటికీ మధ్యంతర ప్రధాన కార్యదర్శిగానే భావిస్తున్నామనీ.. ఆమెకు పూర్తి బాధ్యతలు అప్పగించలేదన్నారు.
 
అలాగే అన్నాడీఎంకే చీఫ్ శశికళ తన మీద చేస్తున్న ఆరోపణలపై ఓపీ తీవ్రస్థాయిలో స్పందించారు. మనుషులు, జంతువుల మధ్య తేడా ఉందని అన్నారు. ఆ తేడా ఏంటంటే మనుషులు చిరునవ్వు చిందిస్తారని, అదేం పెద్ద నేరం కాదని తన మీద ఆరోపణలు చేసిన వారికి చురకలు అంటించారు. తాను నోరు విప్పింది కొంతే, మాట్లాడేదే ఇంకా చాలా ఉంది, అవన్నీ తనతో చెప్పించే ప్రయత్నం చేయొద్దని, నన్ను నన్నుగా ఉండనీయండి అంటూ పన్నీర్ సెల్వం అవతలి పక్షాన్ని ఘాటుగా హెచ్చరించారు. తానేంటో కొన్ని గంటల్లో చూపిస్తానని శశికళకు పరోక్షంగా సవాలు విసిరారు.
 
నిన్నటి వరకు అత్యంత విశ్వాసపాత్రుడిగా, అసలు నోరు విప్పని పన్నీర్ సెల్వం మంగళవారం రాత్రి నుంచి శశికళ, ఆమె అనుచరులు, మన్నార్ గుడి గ్యాంగ్ మీద విరుచుకుపడుతున్నారు. తమిళనాడు పరిస్థితిని శశికళ ఎందుకు అర్థం చేసుకోవడం లేదు, అంత అర్జెంటుగా ఆమె సీఎం అయిపోయి ఏం చేయాలనుకుంటున్నారని సూటిగా ప్రశ్నించారు. అన్నాడీఎంకే పార్టీకి, అమ్మకు నిజమైన విశ్వాసపాత్రుడు నేనే అంటూ పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు.