గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (11:09 IST)

పళనిస్వామికి ఫోన్ చేసి అభినందించిన శశికళ.. ఫోన్ ఎవరిచ్చారు?

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామికి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఫోన్ చేసి అభినందించినట్టు సమాచారం. అయితే, బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో ఉన్న శశికళకు ఫోన్ ఎవరిచ్చారన్నదానిపైనే

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామికి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఫోన్ చేసి అభినందించినట్టు సమాచారం. అయితే, బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో ఉన్న శశికళకు ఫోన్ ఎవరిచ్చారన్నదానిపైనే ఇపుడు సర్వత్ర చర్చ సాగుతోంది. 
 
తన వర్గానికి చెందిన పళని సీఎం కావడంతో, బలపరీక్షలో కూడా పళని నెగ్గడంతో శశికళ ఆనందానికి అవధుల్లేవు. సుప్రీం తీర్పుతో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో కటకటాలు లెక్కిస్తున్న శశికళ శుక్రవారం తమిళనాడులో జరిగిన పరిణామాలను టీవీలో వీక్షించారు. 
 
పళని బల పరీక్ష నెగ్గగానే ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సమయంలో శశికళ పళనికి కొన్ని ఆదేశాలు జారీ చేశారు. కొంతమంది మంత్రులతో కూడా శశికళ ఫోన్‌లో మాట్లాడారు. గురువారం రాత్రి జైల్లోని మొదటి ఫ్లోర్‌లో ఉన్న శశికళ తనకు టీవీ చూసేందుకు అనుమతినివ్వాల్సిందిగా జైలు ఉన్నతాధికారులను కోరారు. 
 
ఆమె కోరికను మన్నించిన అధికారులు టీవీ చూసేందుకు అనుమతించారు. దీంతో ఆమె తన గదిలో నుంచి బయటికొచ్చి టీవీ చూశారు. శనివారం అసెంబ్లీలో జరిగిన ప్రతీ సీన్‌ను శశికళ టీవీలో వీక్షించారు. పళని నెగ్గగానే ఆమె గదికి తిరిగెళ్లారు. ఆయనకు ఫోన్ చేసి దాదాపు 7 గంటల వరకూ మాట్లాడారు. కొందరు న్యాయ నిపుణులతో కూడా శశికళ సంప్రదింపులు జరిపారు.
 
తనకు ఏ క్లాస్ గదిని కేటాయించేలా చూడాలని ఆమె న్యాయనిపుణులకు సూచించారు. ఆమె తరపు లాయర్ కులశేఖరన్ ఇదే విషయాన్ని మీడియాకు చెప్పారు. శశికళ డయాబెటిస్‌తో బాధపడుతున్నారని, ఆమెకు ఏ క్లాస్ గది కేటాయించాలని అధికారులను కోరనున్నట్లు కుల శేఖరన్ తెలిపారు. అయితే ఈ అంశం మొత్తంలో ముద్దాయిగా జైలు జీవితం గడుపుతున్న శశికళకు ఫోన్ ఎవరిచ్చారనేది అంతుచిక్కని ప్రశ్న.