గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 15 మార్చి 2017 (09:10 IST)

మారుతున్న అన్నాడీఎంకే నేతల మనోగతం : వామ్మో.. శశికళ ఫోటోనా? ఇంకేమైనా ఉందా?

తమిళనాడు రాష్ట్ర అధికార అన్నాడీఎంకే పార్టీ నేతల మనోగతం మారిపోతోంది. నిన్నమొన్నటివరకు దివంగత జయలలిత తర్వాత ఆమె ప్రియ నెచ్చెలి శశికళే దైవంగా భావించారు. వంగివంగి దండాలు పెట్టేవారు కొందరైతే.. సాష్టాంగ నమస

తమిళనాడు రాష్ట్ర అధికార అన్నాడీఎంకే పార్టీ నేతల మనోగతం మారిపోతోంది. నిన్నమొన్నటివరకు దివంగత జయలలిత తర్వాత ఆమె ప్రియ నెచ్చెలి శశికళే దైవంగా భావించారు. వంగివంగి దండాలు పెట్టేవారు కొందరైతే.. సాష్టాంగ నమస్కారాలు చేసేవారు మరికొందరు. కానీ, జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ బెంగుళూరు జైలుకు వెళ్లడంతో సీన్ ఒక్కసారి రివర్స్ అయింది. 
 
పార్టీ తరపున నిర్వహించే కార్యక్రమాల కోసం ముద్రించే బ్యానర్లు, పోస్టర్లు, తయారు చేసే కటౌట్లలో ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ ఫోటోను ముద్రించేందుకు ఆమె మద్దతుదారులు వెనుకంజ వేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న సంక్షేమ పథక సహాయాల పంపిణీ కార్యక్రమం చెన్నై శివారు ప్రాంతమైన కోవిలంబాక్కంలో ఇటీవల జరిగింది. 
 
ఇందుకోసం పల్లావరం - తురైపాక్కం రోడ్డులో భారీ బ్యానర్లను శశికళ వర్గీయులు ఏర్పాటు చేశారు. కానీ, శశికళ ఫోటో, పేరు మాత్రం వాటిలో మచ్చుకైనా కనిపించలేదు. అక్రమార్జన కేసులో జైలుకెళ్లిన శశికళ ఫోటోను ముద్రిస్తే పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని భావించిన కొందరు ఆమె ఫోటో లేకుండా బ్యానర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితుల్లో ఇదే మంచిదని కొందరు కార్యకర్తలు పేర్కొన్నారు.
 
మరోవైపు.. అన్నాడీఎంకే తిరుగుబాటు నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంకు మద్దతు, ఆదరణ నానాటికీ పెరుగుతోంది. పార్టీకి చెందిన పలువురు మాజీ నేతలు, ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులు ఆయనకు జైకొడుతున్నారు. అదేసమయంలో మరికొందరు ఎమ్మెల్యేలు ఆయన గూటికి చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.