గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (04:34 IST)

ఐదుగురు మంత్రుల జంప్‌! 30 మంది ఎమ్మెల్యేలు ఏపీకి తరలింపు

శిబిరంలో ఎమ్మెల్యేలతో శశికళ సమావేశం ముగియగానే అక్కడి నుంచి ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే జారుకున్నట్టు తేలింది. అలాగే, శిబిరం వద్ద ఉండాల్సిన మరో ముగ్గురు మంత్రుల జాడ కానరాలేదు. పన్నీర్‌సెల్వం దూకుడు పెంచడంతో శశికళ తన శిబిరంలోని సుమారు 30 మంది ఎమ్మెల్య

తమిళనాడులో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఢిల్లీ వేదికగా బలం నిరూపించుకునేందుకు అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. తమిళనాడు గవర్నర్‌ వ్యూహాత్మకంగా జాప్యం చేస్తున్నారన్న విషయాన్ని జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగానే శనివారం మధ్యాహ్నం రాష్ట్ర ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావుకు హెచ్చరికతో కూడిన లేఖ పంపి, ఎమ్మెల్యేలతో రావడానికి సమయం ఇవ్వాలని కోరారు. సమయం ఇవ్వకపోతే తానే రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అన్నాడీఎంకేను చీల్చడానికే గవర్నర్‌ నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తున్నారని మీడియా సమావేశంలో ఆరోపించారు. శశికళ ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం వారందరినీ వెంట బెట్టుకుని రాజ్‌భవన్‌కు వస్తారని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది.
 
రాజ్‌భవన్‌తో పాటు ఆ చుట్టుపక్కల భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరింప చేసింది. ఈ వరుస పరిణామాలతో శశికళ ప్రత్యక్ష పోరాటానికే సిద్ధమయ్యారని స్పష్టంకావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చెన్నై నగరంలో అదనపు పోలీసు బలగాలను మోహరించి అణువణువు తనిఖీలు ప్రారంభించారు. అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు శశికళకు శిక్ష విధిస్తే ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అనర్హురాలవుతారని, దీనివల్ల మళ్లీ సంక్షోభం ఏర్పడుతుందనే ఆలోచనతో గవర్నర్‌ ఆమెను సీఎం చేయడాని ఇష్టపడడంలేదని శుక్రవారం టీవీ చానళ్లు, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. 
 
ఈ విషయమే శనివారం అనేక పత్రికల్లో కథనాలుగా ప్రచురితమైంది. కేంద్ర ప్రభుత్వమే ఈ విషయాన్ని రాజ్‌భవన్‌ ద్వారా లీక్‌ చేయించి ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు తన నుంచి వెళ్లిపోయేలా కుట్ర చేసిందని శశికళ బలంగా విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. తన శిబిరంలో నుంచి ఒక్కొక్కరుగా వెళుతుండడంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆలస్యం అయ్యే కొద్దీ బలాబలాల్లో మార్పులు వస్తాయనే ఆందోళనతో ఎమ్మెల్యేలను కాపాడుకోవడం మీదే దృష్టి పెట్టారు.
 
శనివారం మధ్యాహ్నం నేరుగా ఎమ్మెల్యేల శిబిరానికి వెళ్లి మూడు గంటలపాటు వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మనమంతా సమిష్టిగా ఉంటే మరో రెండు, మూడు రోజులకైనా తనను సీఎం చేయక తప్పదని వారికి ధైర్యం నూరిపోసినట్లు తెలిసింది. ఆదివారం సాయంత్రంలోగా గవర్నర్‌ నుంచి పిలుపురాకపోతే సోమవారం ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి ఎదుట ఎమ్మెల్యేల పరేడ్‌ నిర్వహించాలనీ, ఢిల్లీ వేదికగానే ఆందోళనకు దిగేలా ఏర్పాట్లు చేయాలని శశికళ నిర్ణయించుకున్నారు. తనకు అత్యంత నమ్మకస్తులుగా ఉన్న ఎంపీలను ఈ ఏర్పాట్ల కోసం పురమాయించారు. అయితే ఢిల్లీలో కాకుండా మెరీనాబీచ్‌ జయలలిత సమాధి వద్ద ఆమరణదీక్షకు దిగాలని కొందరు ఎమ్మెల్యేలు ఆమెకు సూచించారు.
 
శిబిరంలో ఎమ్మెల్యేలతో శశికళ సమావేశం ముగియగానే అక్కడి నుంచి ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే జారుకున్నట్టు తేలింది. అలాగే, శిబిరం వద్ద ఉండాల్సిన మరో ముగ్గురు మంత్రుల జాడ కానరాలేదు. ఇందులో అటవీ శాఖ మంత్రి దిండుగల్‌ శ్రీనివాసన్, పాడి, డెయిరీ శాఖ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ, విద్యుత్‌శాఖ మంత్రి తంగమణి, పురపాలక శాఖ మంత్రి ఎపీ వేలుమణి, గ్రామీణ పరిశ్రమల శాఖ మంత్రి బెంజిమిన్, మాజీ మంత్రి, కరూర్‌ ఎమ్మెల్యే సెంథిల్‌ బాలాజీ ఉన్నట్టు ప్రచారం ఊపందుకుంది. వీరంతా ఆదివారం పన్నీరు శిబిరంలో ప్రత్యక్షమవుతారేమో అన్న ఆందోళన శశికళ శిబిరంలో నెలకొంది. పన్నీర్‌సెల్వం దూకుడు పెంచడంతో శశికళ తన శిబిరంలోని సుమారు 30 మంది ఎమ్మెల్యేలను ఆంధ్రప్రదేశ్‌కు తరలించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.