శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 6 మే 2016 (15:53 IST)

'సేవ్ డెమొక్రసీ' పేరుతో కాంగ్రెస్ ర్యాలీ : సోనియా, రాహుల్, మన్మోహన్ అరెస్టు, రిలీజ్

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి (సేవ్ డెమొక్రసీ) పేరుతో కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీతోపాటు మరికొందరు పాల్గొన్నారు. వీరందరినీ ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. 
 
ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ వైపు దూసుకెళ్లారు. సోనియా, రాహుల్‌తో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ తీశారు. బీజేపీ ప్రభుత్వం జాతి వ్యతిరేకంగా పనిచేస్తోందంటూ నినాదాలు చేశారు. అన్ని చట్టాలను ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ నేతలకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.  
 
అయితే, పార్లమెంట్ వైపు వస్తున్న నేతలను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అలా కొద్దిసేపు ఉంచుకున్నారు. ఆ సమయంలో మిగతా కాంగ్రెస్ నేతలు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. ప్రధాన నేతలను అరెస్టు చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌లోకి దూసుకొచ్చారు. అనంతరం కాంగ్రెస్ ముఖ్యనేతలను పోలీసులు విడిచిపెట్టారు.