మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : మంగళవారం, 30 జూన్ 2015 (18:39 IST)

స్వలింగ వివాహాలను చట్టపరం చేయడానికి కేంద్రం పరిశీలిస్తోంది: సదానంద గౌడ

దేశంలో స్వలింగ వివాహాలను చట్టపరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర న్యాయశాఖ మంత్రి డి.వి సదానంద గౌడ తెలిపారు. బెంగుళూరులో మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వలింగ సంపర్కుల వివాహాలకు అడ్డుగా ఉన్న భారత నేర విభాగ చట్టం 377ను సెక్షన్‌ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు. తద్వారా గే, లెస్బియన్‌ల వివాహాలకు చట్టప్రకారం అనుమతి లభించే అవకాశం ఏర్పడుతుందని అన్నారు. 
 
అదే విధంగా గే, లెస్బియన్ జంటలు వివాహాలను అంగీకరించే రీతిలో చట్టంలో మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్టు ఆయన తెలిపారు. ఇటీవల గే, లెస్బియన్ వివాహాలకు దేశ వ్యాప్తంగా అనుమతి ఇస్తూ అమెరికా కోర్టు సంచల తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసిన గౌడ అమెరికా కోర్టు తీర్పుకు భారత్‌లో కూడా భారీ స్థాయిలో మద్దతు లభించిందని తెలిపారు. 
 
అయినప్పటికీ ఈ అంశంలో అంత సులభంగా నిర్ణయం తీసుకోవడం కుదరదన్నారు. సాంప్రదాయాలు, కట్టుబాట్లకు అధిక ప్రాధాన్యతను ఇచ్చే భారత చట్టంలో గే, లెస్బియన్ వివాహాలకు తగిన మార్పులు తేవాలంటే సుదీర్ఘ చర్చలు, సమావేశాలు నిర్వహించాల్సి ఉందని, ఆ తర్వాతనే దీనిపై కేంద్ర ప్రభుత్వం ప్రకటనను వెల్లడిస్తుందని గౌడ వివరించారు.