గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (15:54 IST)

ఈరోజు ఆమె ఆ ముసలాడిని (పీటర్‌ను) పెళ్లి చేసుకుంది: తండ్రికి రాసిన లేఖలో షీనా

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న షీనా బోరా కేసులో అనేక ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జియా రెండో మాజీ భర్త సిద్ధార్థ్ దాస్‌ను కోల్‌కతాలో అరెస్టు చేసిన తర్వాత ఆయన ఇంట్లో ముంబై పోలీసులు నిర్వహించిన సోదాల్లో షీనా బోరా డైరీలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో తల్లి షీనాకు తనకు మధ్య ఉన్న సంబంధాలు, తల్లి పట్ల తనకున్న ప్రేమ ఆప్యాయతలు, తల్లి ఇంద్రాణి చెడు ప్రవర్తన, తండ్రి సిద్ధార్థ్ దాస్ గురించి ఇలా అనేక అంశాలను ప్రస్తావించింది. ఈ డైరీల్లో తల్లిదండ్రులు ఇంద్రాణి, సిద్ధార్థ్ దాస్‌లతో పాటు.. షీనాకు కూడా సఖ్యత లేదనే విషయం బయటపడింది.
 
ముఖ్యంగా గౌహతి పదో తరగతి చదువుకునే రోజుల్లో ఫిబ్రవరి 11వ తేదీన "హో.. నాకు నేనే పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకోవాలి. నేను సంతోషంగా లేను. జీవితంలో నాకేదీ దక్కలేదు. భవిష్యత్తు అంతా అంధకారంగా కనిపిస్తోంది. మా అమ్మను నేను ద్వేషిస్తున్నాను. ఆమె.. ఆమె తల్లి కాదు. దుర్మార్గురాలు" అంటూ అప్పట్లోనే తన ఆవేదనను వ్యక్తం చేసింది.
 
ఆ తర్వాత కోల్‌కతాలో నివశించే తన తండ్రి సిద్ధార్థ దాస్‌కు షీనా ఉత్తరాలు రాసింది. "నాన్నా.. నువ్వు చెప్పినట్లే, రోజూ గోళ్లు కత్తిరించుకుంటున్నా. మొదట చదువు.. తర్వాత స్టైల్‌ అన్న నీ సూచనలు పాటిస్తున్నా. నాన్నా.. నాకో చిన్న సమస్య. అప్లికేషన్‌లో మన కులం ఏదో రాయాలి. ఇంతకీ మనది ఏ కులం? మా పదో తరగతి పరీక్షలు పూర్తయ్యేలోపు ఒక్కసారైనా వస్తావా?" అంటూ సిద్ధార్థ దాస్‌ను కోరింది. 
 
అంతేనా, అమ్మమ్మ వాళ్లకు (ఇంద్రాణి తల్లిదండ్రులు) నువ్వంటే ఇష్టం లేదని, తమ కూతురి తప్పులను వాళ్లు ఎప్పటికీ అంగీకరించరని కూడా తండ్రికి రాసిన ఉత్తరంలో రాసింది. "అమ్మ గురించి ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. అమ్మను నేను ఎప్పుడు చూశానో నాకే గుర్తు లేదు. నాకు ఆమె అంటే ప్రేమ ఉంది. ఆమెను గట్టిగా పట్టుకోవాలని ఉంది. కానీ, నాన్నా.. నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం. నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు" అని అని షీనా తన డైరీలో రాసుకుంది. "ఈరోజు ఆమె ఆ ముసలాడిని (పీటర్‌ను) పెళ్లి చేసుకుంది. అమ్మమ్మ, తాతయ్య ఎంతో గొప్పగా ఫీలవుతున్నారు. ఇంద్రాణి తెలివైందనుకుంటున్నారు. నాకు మాత్రం అలా అనిపించడం లేదు. ఆమె అంటే నాకు ఇష్టం లేదు. ఆమె ఓ పెద్దదెయ్యం. నాకు ఏడుపొస్తోంద" షీనా తన డైరీలో రాసుకుంది.