గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2015 (13:18 IST)

తల్లికి సన్నిహితుడితో కూతురు షీనా గర్భవతి...? అసలిది కార్పొరేట్ హత్యా... పరువు హత్యా...?

షీనా బోరా హత్య కేసు సినిమాల్లో ట్విస్టులను మించి రోజుకో మలుపు తిరుగుతోంది. హత్యకు గురైన షీనా గర్భవతి అని తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. గర్భం ధరించడం వల్ల ఎక్కడ తన పరువు పోతుందని భయపడిన ఇంద్రాణి ఆమెను హత్య చేయించినట్లు అనుమానిస్తున్నారు.

హత్య చేయబడటానికి ముందు షీనా బోరా తను గర్భవతినని ఇంద్రాణికి బాగా సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తితో చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు షీనాకు ఇంద్రాణి భర్త అయిన పీటర్ కుమారుడు రాహుల్ ముఖర్జియాతో రిలేషన్ షిప్ ఉండటం తెలిసిందే. వారిరువురు పెళ్లికి ప్లాన్ చేసుకుంటున్న సమయంలో షీనా హత్య గావింపబడిందని తెలుస్తోంది. ఈ హత్య వ్యవహారం రాహుల్, పీటర్ లకు తెలియనివ్వకుండా ఇంద్రాణి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
 
మరోవైపు షీనా బోరా హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. స్టార్ ఇండియా మాజీ సీఈవో పీటర్ ముఖర్జియా కుమారుడి వద్ద పోలీసులు విచారణ జరిపారు. రాత్రి ఆయన్ని ప్రశ్నించిన పోలీసులు షీనా కనిపించకుండా పోయినప్పుడు ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. 
 
దాదాపు సంవత్సరం పాటు షీనా బోరా, రాహుల్ ముఖర్జియాల సంబంధాలు కొనసాగుతున్నప్పుడు.. ఆమె కనుమరుగైన విషయాన్ని పోలీసులకు ఎందుకు తెలియజేయలేదని పోలీసులు ప్రశ్నించారు. పీటర్ ముఖర్జియాకి రాహుల్ కుమారుడు కాగా, పీటర్ భార్య ఇంద్రాణి ముఖర్జియాకి షీనా కుమార్తె అవుతుంది. ఈ నేపథ్యంలో తన తొలి భర్త ద్వారా ఇంద్రాణి షీనాకు జన్మనిచ్చింది. ఇక ఇంద్రాణికి పీటర్ మూడో భర్త కావడం గమనార్హం.
 
ఇదిలా ఉంటే.. గత మూడేళ్ల క్రితం హత్యకు గురైన షీనా బోరా కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జీ ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే కన్నతల్లే ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. షీనా బోరా హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జీ గురించి అసలు సంగతులు బయటపెడ్తానని కుమారుడు మిఖిల్ బోరా చెప్తున్నాడు. 
 
తన సోదరిని తల్లి ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో తనకు తెలుసునని.. అయితే పోలీసుల ముందు తల్లి నేరాన్ని ఒప్పుకోకపోతే మాత్రం తాను సాక్షిగా మారతానని తెలిపాడు. ఆగస్టు 31వ తేదీ వరకు ఇంద్రాణికి పోలీస్ కస్టడీ విధించారు. వారి విచారణలో నేరాన్ని ఒప్పుకోకపోతే మాత్రం ఆ హత్యకు గల కారణాలను చెబుతానని మిఖిల్ బోరా అంటున్నాడు. 
 
కాగా 2012లో హత్యకు గురైన షీనా బోరా కేసులో టీవీ మొగల్ స్టార్ ఇండియా మాజీ సీఈవో పీటర్ ముఖర్జియా భార్య ఇంద్రాణిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. స్టార్ ఇండియా 2002లో స్టార్ ఇండియా సీఈఓగా పీటర్ ఉన్నప్పుడు ఇంద్రాణిని పెళ్లాడాడు. అంతకుముందే ఇద్దరికీ జరిగిన వివాహాలు విడాకులకు దారితీశాయి. అయితే ఆమెకు సిద్ధార్థ దాస్, సంజీవ్ ఖన్నాలతో జరిగిన పెళ్లిళ్ల విషయాన్ని పీటర్ దగ్గర దాచేసింది. 
 
అనంతరం చోటుచేసుకున్న పరిణామాలే కుమార్తె షీనా బోరా హత్యకు కారణమయ్యాయి. ఆ విషయాన్ని దాచిపెట్టిన ఇంద్రాణి.. షీనా అమెరికాకు వెళ్ళినట్టు అందరిని నమ్మించింది. ఈ హత్య కేసులో ఇంద్రాణి పాత్ర ఉందని తేలడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

కాగా షీనా హత్యకు ఆర్థిక లావాదేవీలు కారణం కూడా కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనితో ఇది కార్పొరేట్ హత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. షీనా ఖాతాలోకి తల్లి ఇంద్రాణి పెద్దమొత్తంలో డబ్బును జమ చేసినట్లు తెలుస్తోంది. డబ్బు తిరిగి ఇచ్చేయాల్సిందిగా ఇంద్రాణి కోరగా షీనా అందుకు నిరాకరించిందనీ, పైగా సోదరుడి వరసయిన వాడితో సంబంధం వద్దని చెప్పినా విన్లేదన్న వార్త కూడా వస్తోంది. ఈ నేపధ్యంలో షీనాది కార్పొరేట్ హత్యా... లేదంటే పరువు హత్యా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.