శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (12:42 IST)

వీరుడా శతకోటి వందనాలు.. నీ స్ఫూర్తి ప్రశంసనీయం: ప్రణబ్‌ - మోడీ - సోనియా

మంచు పలకల కింద ఆరు రోజులు.. ఆస్పత్రిలో మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిన సియాచిన్‌ వీరుడు లాన్స్‌నాయక్‌ హనుమంతప్పకు శతకోటి భారత ప్రజలు కన్నీటి అంజలి ఘటిస్తున్నారు. ఈ వీర సైనికుడు మృత్యువుతో పోరాటం చేసి చివరకు గురువారం ఉదయం 11.30 గంటలకు ఆస్పత్రిలో ప్రాణాలు విడిచిన విషయం ల్సిందే. ఈ వీరుడి మరణ వార్త తెలుసుకున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలు వేర్వేరు ప్రకటనలో తమ సంతాపాలను వెల్లడించారు. 
 
సియాచిన్‌ ధైర్యశాలిని, అనితరసాధ్యమైన హనుమంతప్ప స్ఫూర్తిని దేశ ప్రజలు నిత్యం స్మరించుకుంటారని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ హనుమంతప్ప ప్రదర్శించిన పోరాటస్ఫూర్తి ప్రశంసనీయమన్నారు. ఈ విషాదక్షణాల్లో జాతి మొత్తం హనుమంతప్ప కుటుంబం వెంట నిలుస్తుందని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. 
 
'మన ఆశల్ని కూల్చివేస్తూ విషాదంలో ముంచేస్తూ హనుమంతప్ప శాశ్వతంగా వీడ్కోలు పలికారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. భారతమాత సేవలో తరించే ఇలాంటి వీరులు దేశానికి గర్వకారణంగా నిలుస్తారు' అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. 
 
ఇకపోతే.. సోనియా గాంధీ విడుదల చేసిన ప్రకటనలో... భారతదేశ ముద్దుబిడ్డ, గుండెధైర్యం కలిగిన హనుమంతప్ప బతకాలని జాతి మొత్తం ప్రార్థనలు చేసిందని, ఈ రోజు ప్రతి పౌరుడూ ఆయన మృతికి దుఃఖిస్తున్నారని పేర్కొన్నారు. ధైర్య సాహసాలంటే ఏంటో ప్రపంచానికి హనుమంతప్ప చాటారని, ఆయన సంకల్పం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి అని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. 
 
సియాచిన్‌ గుండె నిబ్బరుడు హనుమంతప్ప మృతి కలచివేసిందని బీహార్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ ట్వీట్ చేశారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ కూడా హనుమంతప్ప మృతి పట్ల సంతాపం ప్రకటించారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య విచారం వ్యక్తం చేశారు. హనుమంతప్ప కుటుంబానికి 25 లక్షల పరిహారాన్ని ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే కొంత భూమితోపాటు ఆయన భార్యకు ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్లు ఆయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.