గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (09:04 IST)

కోమాలోకి హనుమంతప్ప... ఈ వీర జవాను ఎలా బతికారు?

సియాచిన్‌ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డ జవాను లాన్స్‌ నాయక్‌ హనుమంతప్ప కోమాలోకి వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనకు ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. సియాచిన్‌లో 19 వేల అడుగుల ఎత్తులో మంచు చరియలు విరిగిపడడంతో ఓ అధికారి సహా పది మంది జవాన్లు గల్లంతైన విషయం తెలిసిందే. 
 
ఈ ప్రమాదం నుంచి కర్ణాటకకు చెందిన జవాను హనుమంతప్ప ఆరు రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు. మంచుచరియల్లో చిక్కుకున్న లాన్స్‌ నాయక్‌ హనుమంతప్పను మంగళవారం సహాయకసిబ్బంది గుర్తించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో మంగళవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్మీ చీఫ్ దల్బీర్‌ సింగ్‌‌‌లు స్వయంగా ఆస్పత్రికి వెళ్లి జవానును పరామర్శించారు. 
 
మరోవైపు ఈ సాహస జవాను ఆరు రోజుల వరకు ఎలా బతికివుండటం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. టన్నుల కొద్దీ మంచు... కన్నుమూసి తెరిచేలోపు పెనుతుఫానులా విరుచుకుపడుతుంటే దాన్నుంచి తప్పించుకోవడం ఎవరికీ అసాధ్యం. కానీ.. మానవ ప్రయత్నం చేయాలి. మానవ ప్రయత్నం అంటే.. హిమపాతం విరుచుకుపడగానే దాన్నుంచి తప్పించుకోవడానికి కిందికి స్కీ చేయకూడదు. ఎంత వేగంగా స్కీ చేసినా తప్పించుకోవడం అసాధ్యం. అందుకే స్కీయింగ్‌ చేసేవారు తాము ఉన్నవైపు నుంచి కుడి లేదా ఎడమ పక్కకు స్కీ చేయాలి. 
 
ఎందుకంటే.. అవలాంచ్‌ కేంద్ర భాగంలో బలం, మంచు ఎక్కువ. పక్కలకు వెళ్లేకొద్దీ మంచు తాకిడి, వేగం రెండూ తగ్గిపోతాయి. అందుకే పక్కలకు వెళ్తే ప్రాణాలు కాపాడుకోవడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే దారిలో చెట్ల వంటివి ఉంటే వాటిని గట్టిగా పట్టుకోవాలి. వేగంగా స్కీ చేయడానికి వీలుగా బ్యాక్‌ప్యాక్‌ల వంటి బరువును వదిలించుకోవాలి. ఎన్నిచేసినా పరిస్థితి విషమించి మంచు కింద కప్పబడిపోతే.. అది గట్టిపడేలోపు ముఖం వద్ద చేతులతో లేదా స్నో షోవెల్‌ (మంచును తవ్వడానికి ఉపయోగించే సాధనం) వంటివాటితో చిన్న ఎయిర్‌ ప్యాకెట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. 
 
అంటే ఊపిరి మొత్తం ఆగిపోకుండా మంచుకి, ముఖానికి మధ్యభాగంలో కాస్తంత ఖాళీ ఏర్పాటు చేసుకోవాలి. ఈ పాఠాలే హనుమంతప్పకు ఉపయోగపడ్డాయని వైద్యులు చెబుతున్నారు. ఆయన ప్రయత్నపూర్వకంగా ఎయిర్‌ప్యాకెట్‌ ఏర్పరచుకున్నారో లేక మంచుపెళ్లలు పడే సమయంలో ఒక్కోసారి సహజంగా ఏర్పడే ఎయిర్‌ ప్యాకెట్‌ వల్లనో.. హనుమంతప్పకు గాలి పీల్చుకునే అవకాశం లభించిందని, అదే అతడి ప్రాణాలు కాపాడిందని వైద్య నిపుణులు చెపుతున్నారు. ఏది ఏమైనా.. ఈ భారత వీర జవాను ప్రాణాపాయం నుంచి బయటపడాలని ఆ దేవుడిని ప్రార్థిద్ధాం.