మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (11:22 IST)

100 రోజుల మోడీ పాలనపై సోనియా ఫైర్!

వంద రోజుల పాలనలో ప్రధాని నరేంద్ర మోడీ అద్భుతంగా పనిచేశారని మెజార్టీ ప్రజలు కీర్తిస్తూ ఉంటే, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాత్రం విమర్శనాస్త్రాలు సంధించారు. సోమవారం తన సొంత నియోజకవర్గం రాయిబరేలీలో పర్యటించిన సందర్భంగా సోనియా, మోడీ సర్కారుపై విరుచుకుపడ్డారు. 
 
ద్రవ్యోల్బణాన్ని ప్రస్తావించిన సోనియా, ధరలు దిగిరాలేదేమంటూ దెప్పి పొడిచారు. రాయిబరేలీలో రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన సోనియా, ఈ దఫా ప్రజలతో మమేకమవుతున్నారట.
 
కాగా.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె పుత్రరత్నం యువరాజు రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గాల పర్యటనలకు మొగ్గు చూపారు. రాయిబరేలీలో రెండు రోజుల పర్యటన నిమిత్తం సోనియా సోమవారమే అక్కడికి వెళ్లిపోయారు. 
 
కార్యకర్తలతో పాటు ప్రజలతోనూ ఆమె మమేకమవుతున్నారు. నిన్నటిదాకా కిందిస్థాయి కార్యకర్తలు, ప్రజలతో అంటీముట్టనట్టు వ్యవహరించిన సోనియా, తాజాగా నియోజకవర్గ పర్యటనలో గడపగడపకూ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తున్నారు. 
 
తల్లి పర్యటన కొడుకునూ ఉత్తేజపరిచినట్టుంది. గురువారం నుంచి రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గం అమేథీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన కూడా గతంలో మాదిరిగా కాకుండా కింది స్థాయి కార్యకర్తలతో మరింత సన్నిహితంగా మెలిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట.