గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 31 జులై 2014 (19:19 IST)

నట్వర్ సింగ్‌పై సోనియా విసుర్లు.. నా ఆత్మకథ నేనే రాస్తా!

భారత విదేశాంగ మాజీ మంత్రి నట్వర్ సింగ్‌పై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మండిపడ్డారు. ఆయన తనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల ఆమె గురువారం తీవ్రంగా స్పందించారు. తన ఆత్మ కథను త్వరలోనే తీసుకువస్తానని, అన్ని ‘వాస్తవాలు’ అందులో వెల్లడవుతాయని ప్రకటించారు. ‘‘నా ఆత్మకథను నేనే రాస్తాను. అన్ని విషయాలు మీకు అందులో తెలుస్తాయి... నిజాలు వెలుగు చూడాలంటే నేనే రాయాలి. ఈ విషయంలో నేను సీరియస్‌గా ఉన్నాను... నేను రాస్తాను’’ అని పార్లమెంట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆమె అన్నారు.
 
2004లో ప్రధాని పదవిని స్వీకరించడానికి సోనియా నిరాకరించడానికి గల కారణాలను నట్వర్ సింగ్ తన ఆత్మకథలో వివరించారు. ఇది వివాదాస్పదం కావడంతో దీనిపై విలేకరుల ప్రశ్నకు సోనియా ఈ విధంగా స్పందించారు. నట్వర్ సింగ్ తన ఆత్మకథలో చేసిన వ్యాఖ్యలపై తాను మనస్తాపం చెందలేదని ఆమె స్పష్టం చేశారు. తన భర్త రాజీవ్ గాంధీ హత్య, తన అత్తగారు ఇందిరా గాంధీ తూటాలకు నేలకొరగడం వంటి ఇంత కన్నా దారుణమైన సంఘటనలు తాను చూశానని సోనియా చెప్పారు. 
 
‘‘ఇలాంటి (నట్వర్ వ్యాఖ్యలు) విషయాలపై నేను మనస్తాపం చెందబోను. ఇలాంటి విషయాలు నన్ను ఏమీ చేయలేవు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రధాని పదవిని చేపట్టడానికి తన ‘‘మనస్సాక్షి’’ అంగీకరించడం లేదన సోనియా గాంధీ అప్పట్లో చెప్పారని, కానీ అసలు వాస్తవం ఏమిటంటే ఆ పదవిని అంగీకరిస్తే తన తండ్రి, నానమ్మలాగే తన తల్లి కూడా హత్యకు గురవుతుందన్న భయంతో సోనియా కుమారుడు రాహుల్ గాంధీ దీనికి అభ్యంతరం తెలిపారని నట్వర్ సింగ్ తన ఆత్మకథలో రాశారు. ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.