శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 6 మే 2016 (17:04 IST)

మోడీ సర్కారుకు కొమ్ముకాయడం తప్ప జయలలిత చేసిందేమీ లేదు: సోనియా

కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారుకు కొమ్ముకాయడం మినహా తమిళనాడు సీఎం జయలలిత ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రజలకు గల ఇబ్బందుల్ని జయ ఏమాత్రం పట్టించుకోవడం లేదని సోనియా దుయ్యబట్టారు. చెన్నైని వరదలు ముంచెత్తితే కేంద్రం నాలుగు వారాల్లో బీమా చెల్లిస్తుందని చెప్పారని కానీ నాలుగు నెలలైనా ఏమీ చేయలేదన్నారు.
 
డీఎంకే కాంగ్రెస్ కూటమి నేతృత్వంలో జరిగిన బహిరంగ సభలో కరుణానిధి, సోనియాగాంధీలు ఒకే వైదికపైకి వచ్చి ప్రసంగించారు. సోనియాగాంధీ తన ప్రసంగంలో అన్నాడీఎంకే వైఫల్యాలపై విరుచుకుపడ్డారు. తమిళనాడు రాష్ట్రం డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. డీఎంకే హయాంలో రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలు నెలకొన్నాయని, పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. 
 
రాష్ట్రంలో మునుపటి అభివృద్ధి సాధించాలంటే అది డీఎంకే, కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని చెప్పారు. ప్రజలు కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని అన్నాడీఎంకేలకు ఈ ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పాలని కోరారు. డీఎంకే నేత కరుణానిధి మాట్లాడుతూ డీఎంకే, కాంగ్రెస్‌ల కూటమి ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.