మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 1 ఆగస్టు 2014 (08:54 IST)

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా : రాజ్యసభలో కేంద్రం స్టేట్మెంట్!

అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయాన్ని ప్రణాళికా సంఘం పరిశీలిస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రణాళికా శాఖామంత్రి రావు ఇందర్‌జిత్ సింగ్ గురువారం రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయమై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరదించారు. అలాగే, రాష్ట్రంలో వెనక బడి ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర రీజియన్లకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆయన తెలిపారు.
 
ప్రణాళిక సంఘంలో ఆంధ్రప్రదేశ్ కోసం 2014 మార్చి 25వ తేదీన ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసినట్లు సింగ్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయమై ప్రధాని అధ్యక్షతన జరిగే జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డిసి) సమావేశంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్ అధ్యక్షతన ప్రత్యేక సెల్, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ విషయం ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం’’లో లేదని ఆయన వివరించారు.  
 
అయితే ఫిబ్రవరి 20వ తేదీన బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్ అధ్యక్షతన సీమాంధ్రలోని వెనకబడిన ప్రాంతాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీకి ప్రత్యేకమైన సెల్ ఏర్పాటు చేస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. సంబంధిత మంత్రులతో చర్చించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ధిష్టమైన ప్రతిపాదనలు పంపితే, వాటి ఆధారంగా వెనకబడిన ప్రాంతాల ప్రత్యేక ప్యాకేజీపై చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.