శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2015 (14:17 IST)

ఆదిలోనే హంసపాదు... జనతా పరివార్‌లో చీలిక... ఎస్పీ ఔట్

బీహార్ రాష్ట్రంలో జనతాపరివార్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. మహాకూటమి నుంచి ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీ వైదొలిగింది. దీంతో ఆరు పార్టీల జనతా పరివార్‌లో చీలిక ఏర్పడింది. బీహార్ రాష్ట్ర ఎన్నికలు త్వరలో జరుగన్నాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు బీహార్ రాష్ట్రంలోని అధికార పార్టీ జేడీయుతో పాటు.. ఆర్జేడీ, కాంగ్రెస్, ఎస్పీ, మరికొన్ని పార్టీలు కలిసి జనతా పరివార్‌గా అవతరించాయి. 
 
అయితే, సీట్ల కేటాయింపుల్లో వచ్చిన విభేదాల కారణంగా కూటమి నుంచి నిష్క్రమిస్తున్నట్టు ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు. ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో తమను పట్టించుకోలేదన్న కారణంగానే కూటమి నుంచి ఎస్పీ తప్పుకున్నట్టు తెలిపారు. అంతేగాక ప్రస్తుత బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌పై ములాయం గుర్రుగా ఉండటం కూడా ఓ కారణంగా ఉంది. 
 
ఇదే అంశంపై ఎస్పీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ మాట్లాడుతూ, బీహార్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయాలని పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయించిందన్నారు. అవసరమైతే మద్దతు కోసం కొన్ని ఇతర పార్టీలతో మాట్లాడతామన్నారు. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై తమను సంప్రదించలేదని, లాలూ, నితీశ్ కుమార్‌ల ఎత్తుగడలను తాము అవమానంగా భావిస్తున్నామని చెప్పారు.