మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2015 (13:08 IST)

దేశవ్యాప్తంగా భూప్రకంపనలు.. ఖాట్మండులో కూలిన భవనాలు!

భారత్‌తో పాటు.. నేపాల్ దేశాన్ని శనివారం భారీ భూకంపం కుదిపేసింది. దాదాపు ఒక నిమిషంసేపు ఈ భూప్రకంపనలు కనిపించాయి. ఈ ప్రకంపనలు రిక్టర్‌ స్కేల్‌పై ఇది 7.5గా నమోదైంది. దాని ప్రకంపనలు దేశంలోని అనేక ప్రాంతాల్లో కనిపించాయి. ఢిల్లీ, నోయిడా, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌, హర్యానాలో బెంగాల్‌లోనూ భూమి కంపించింది. 
 
అనేక చోట్ల జనం భయంతో పరుగులు దీశారు. నేపాల్‌ రాజధాని ఖట్మాండ్‌కు 80 కిలోమీటర్ల దూరంలోని లామ్‌ జంగ్‌ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. సరిగ్గా శనివారం ఉదయం 11.45 గంటల సమయంలో భూకంపం చోటుచేసుకుంది. భూమి లోపం దాదాపు 12 కిలోమీటర్ల లోతున ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు అమెరికాలోని భూకంప కేంద్రంలోని సెసిమోగ్రాఫ్‌ సూచించింది.
 
భూకంపం నేపాల్‌ రాజధాని ఖాట్మండ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఆ దేశ రాజధాని ఖాట్మండులో అనేక భవనాలు కూలిపోయాయి. నగరమంతా దుమ్మధూళితో నిండిపోయింది. ఖాట్మండులోని విమానాశ్రయాన్ని మూసేశారు. అలాగే ఢిల్లీలో కొద్దిసేపు మెట్రో రైలు సర్వీసును నిలిపివేశారు.
 
మరోవైపు భూకంపం ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో అనేక చోట్ల కనిపించింది. తూర్పు, పశ్చిమ, శ్రీకాకుళం, విశాఖ, కృష్ణాజిల్లాల్లో పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.