శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 ఆగస్టు 2014 (14:52 IST)

నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం తనను పదవినుంచి తప్పించిన తీరును సవాలు చేస్తూ ఉత్తరాఖండ్ గవర్నర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. దీంతో యుపిఏ హయాంలో నియమించిన గవర్నర్ల తొలగింపు వివాదం సుప్రీం కోర్టుకు చేరినట్లయింది. 
 
గత మేలో అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం యుపిఏ హయాంలో నియమించిన ఇద్దరు గవర్నర్లను బర్తరఫ్ చేయగా, మరో నలుగురు గవర్నర్లు రాజీనామా చేయడం తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో పదవినుంచి తప్పుకోవాలని, లేకపోతే కేంద్రమే తొలగిస్తుందంటూ గవర్నర్ అజీజ్ ఖురేషిని బెదిరించినట్లు చెప్తున్న హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామికి కూడా కోర్టు నోటీసు జారీ చేసింది. 
 
గవర్నర్ ఆరోపణలపై స్పందించడానికి కేంద్రానికి, గోస్వామికి ఆరువారాలు గడువు ఇచ్చిన ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా నేతృత్వంలోని బెంచ్, ఈ వ్యవహారంలో రాజ్యాంగంలోని 156 అధికరణ (గవర్నర్ పదవికి సంబంధించిన) అంశాలు ఇమిడి ఉన్నాయని పేర్కొంటూ కేసును విస్తృత ధర్మాసనానికి నివేదించింది. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లిన తొలి గవర్నర్ ఖురేషీ కావడం గమనార్హం.