గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 13 ఏప్రియల్ 2017 (16:16 IST)

ఢిల్లీలో తమిళ రైతుల నిరసన.. తమిళ సర్కారుపై సుప్రీం కోర్టు సీరియస్..

తమిళనాడు రైతులు ఢిల్లీలో ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై రెండు వారాల్లో పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని గురువారం సుప్రీం కోర్టు తమిళనాడు సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది

తమిళనాడు రైతులు ఢిల్లీలో ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై రెండు వారాల్లో పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని గురువారం సుప్రీం కోర్టు తమిళనాడు సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు రైతుల ఆందోళనకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీం కోర్టు తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. 
 
అన్నదాతల దుస్థితిపై ఆందోళన జరుగుతున్నా.. సర్కారు మౌనంగా ఉండటం సరికాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. రైతుల పట్ల తమిళనాడు ప్రభుత్వం మానవతాదృక్పదంతో స్పందించాలని సుప్రీం కోర్టు సూచించింది. రైతుల ఆత్మహత్యలు, వారిని ఆదుకోవడంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో పూర్తి సమాచారం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో తమిళనాడులోని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం ఇప్పుడు చిక్కుల్లో పడిందని సమాచారం.
 
కాగా నెల రోజుల్లోపు రుణమాఫీ చేయాలని.. కరువు ఉపశమన ప్యాకేజీలు మంజూరు చేయాలని తమిళ రైతులు డిమాండ్ చేస్తూ ప్రతిరోజూ వినూత్న రీతిలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసనలు చేపడుతున్నారు. గురువారం జంతర్ మంతర్ దగ్గర తమిళనాడు రైతులు అరగుండ్లతో నిరసన వ్యక్తం చేస్తూ రుణమాఫీపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటూ నినాదాలు చేశారు. తమ డిమాండ్లు నేరవేర్చకుంటే గొంతులు కోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించారు.
 
గత నెల రోజుల నుంచి పుర్రెలు, ఎముకలు, ఎలుకలతో ఆందోళన చేస్తూ చెట్లు ఎక్కి నిరసన వ్యక్తం చేసిన తమిళనాడు రైతులు భారతదేశం దృష్టిని ఆకర్షించారు. కేంద్ర ప్రభుత్వానికి తమ ఆవేదనను వినిపించేందుకు ప్రతిరోజూ వినూత్న రీతిలో జంతర్ మంతర్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నారు.