శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 1 జులై 2015 (15:11 IST)

స్త్రీల శరీరాలు దేవాలయాలు... అత్యాచార కేసు రాజీపై సుప్రీంకోర్టు తీర్పు

అత్యాచారం కేసుల్లో రాజీ యత్నాలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబడుతూ కీలక తీర్పును వెలువరించింది. అత్యాచారం చేయడమే కాదు, అత్యాచార కేసుల్లో రాజీ యత్నాలు చేయడం కూడా తప్పేనంటూ బుధవారం స్పష్టం చేసింది. ఎందుకంటే మహిళలు తమ శరీరాలను దేవాలయాల్లాగా భావిస్తారని... ఈ నేపథ్యంలో అత్యాచార కేసుల్లో రాజీ చేయాలనుకుంటే మహిళల హక్కులను హరించినట్టేనని తెలిపింది. ఈ కేసుల్లో నిందితులతో బాధితులు రాజీపడినా నేరమేనని అపెక్స్ కోర్టు స్పష్టం చేసింది. 
 
కాగా, ఇటీవల మద్రాసు హైకోర్టు ఓ అత్యాచార కేసులో బాధితురాలితో రాజీ కోసం ముద్దాయికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెల్సిందే. దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఫలితంగా ఆ తీర్పును వెలువరించిన న్యాయమూర్తి వివరణ కూడా ఇచ్చారు. ఈ తీర్పును ఇపుడు సుప్రీంకోర్టు కూడా తప్పుబట్టింది. అత్యాచార నిందితులకు కఠినమైన శిక్షలను అమలు చేయాలని స్పష్టం చేసింది. 
 
లైంగికదాడి చేసిన వ్యక్తులతో రాజీ కుదుర్చుకోమని కోరడమంటే నేరస్తుల పట్ల మెతకవైఖరిని అవలంభించినట్టేనని అత్యుతున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. రాజీ చేయడమంటే మహిళా హక్కులను కాలరాయడమే కాకుండా, మహిళల గౌరవానికి వ్యతిరేకమైనదని తెలిపింది.