శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 23 జులై 2015 (15:33 IST)

లలిత్ గేట్ వ్యవహారంలో సుష్మా స్వరాజ్ నేరస్తురాలు : రాహుల్ గాంధీ ధ్వజం

లలిత్ గేట్ వ్యవహారంలో విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ నేరస్తురాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరపూరిత చర్యకు ఆమె పాల్పడ్డారని ఆరోపించారు. ముఖ్యంగా భారత్ గాలిస్తున్న ఓ వ్యక్తి దేశం విడిచి పారిపోయేందుకు సహకరించారని, ఈ విషయం బ్రిటన్‌లోని భారత హైకమీషన్‌ కార్యాలయానికి లేదా భారత ప్రభుత్వానికి ఏమాత్రం తెలియదన్నారు. అందువల్ల ఆమెను మంత్రిపదవి నుంచి తప్పించాల్సిందేనని రాహుల్ డిమాండ్ చేశారు.
 
 
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో లలిత్ గేట్, వ్యాపమ్ స్కామ్‌లు విపక్షాలకు ప్రధాన అస్త్రాలుగా లభించిన విషయంతెల్సిందే. దీంతో ఉభయసభలు విపక్షనేతల నిరసనలు, నినాదాలతో మార్మోగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం కూడా లోక్‌సభ వాయిదా పడింది. ఆ తర్వాత  రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ లలిత్ గేట్, వ్యాపమ్ కుంభకోణంపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. మౌనం వీడి సమాధానం చెప్పాలన్నారు. దేశం విడిచి పారిపోయేందుకు లలిత్ మోడీకి సుష్మా స్వరాజ్ సహకరించారని ఆరోపించారు. దీనికి కారణం లలిత్ మోడీతో సుష్మా స్వరాజ్ కుటుంబం వ్యాపారలావాదేవీలు కలిగివుండటమేనన్నారు. 
 
అంతేకాకుండా, గత ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ చెప్పిన అవినీతిరహిత పాలన ఇదేనా? అని రాహుల్ ప్రశ్నల వర్షం కురిపించారు. వ్యాపమ్, లలిత్ గేట్ స్కాముల్లో మోడీ సర్కారు కూరుకుపోయిందని ఆరోపించారు. ప్రజల సమస్యలను వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని దుయ్యబట్టారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదన్నారు. ప్రతిపక్షాల గొంతును అణచివేసేందుకు మోడీ యత్నిస్తున్నారని ఫైరయ్యారు.