శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2015 (11:41 IST)

అమ్మతోడు.. లలిత్ మోడీ తరపున వకాల్తా పుచ్చుకోలేదు : సుష్మా స్వరాజ్

లలిత్ గేట్ వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సోమవారం రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు. ఐపీఎల్ మాజీ ఛైర్మన్, భారత్ గాలిస్తున్న నిందితుడు లలిత్ మోడీకి వీసా మంజూరుచేసేందుకు తాను బ్రిటన్ ప్రభుత్వంతో మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఈ అంశంలో తనపై వస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమన్నారు. పైగా అన్ని అంశాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు ఆమె ప్రకటించారు. అయితే ఆమె ప్రకటన చేస్తుండగా విపక్షాలు వెల్‌లోకి దూసుకొచ్చి తీవ్ర ఆందోళన చేశాయి. దాంతో సభలో గందరగోళం ఏర్పడటంతో డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.
 
మరోవైపు లోక్‌సభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. లోక్‌సభ ప్రారంభంకాగానే విపక్ష సభ్యులు ప్లకార్డులు ధరించి ఆరోపణలు వస్తున్న మంత్రుల రాజీనామాలపై పట్టుబట్టారు. అలాగే, తెరాస ఎంపీలు కూడా ప్లకార్డులు చేతబట్టి నిరసన గళం వినిపించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైకోర్టును కూడా తక్షణమే విభజించాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే పార్లమెంటు ఆవరణలో ఓ సారి నిరసన గళం విప్పిన టీఆర్ఎస్ ఎంపీలు తాజాగా లోక్ సభలోనే ఆందోళనకు దిగారు.