గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 18 మార్చి 2017 (16:35 IST)

తమిళనాట రైతన్న కడుపుకోత.. హస్తినలో పుర్రెలతో ఆందోళనలు

తమిళనాడు రాష్ట్రానికి చెందిన రైతులు ఢిల్లీలో ఆందోళనకు దిగారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం కావేరీ జలాల పర్యవేక్షణ బోర్డును తక్షణం ఏర్పాటు, రైతు రుణాలను మాఫీ చేయాలని, హైడ్రోకార్బన్ ప్రాజెక్టును రద్దు తదిత

తమిళనాడు రాష్ట్రానికి చెందిన రైతులు ఢిల్లీలో ఆందోళనకు దిగారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం కావేరీ జలాల పర్యవేక్షణ బోర్డును తక్షణం ఏర్పాటు, రైతు రుణాలను మాఫీ చేయాలని, హైడ్రోకార్బన్ ప్రాజెక్టును రద్దు తదితర డిమాండ్లతో వారు హస్తిలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ ధర్నాలో పాల్గొన్న రైతులు.. అప్పులు, కరవు వల్ల ఆత్మహత్యలు చేసుకున్న రైతుల పుర్రెలు, ఎముకలతో పాటు... భిక్షం అడుక్కుంటున్నట్టుగా చేతిలో చిప్పలు పట్టుకుని నిరసన వ్యక్తం చేయడం గమనార్హం. 
 
కాగా, గత యేడాది తమిళనాడు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కరవు నెలకొంది. నైరుతి, ఈశాన్య రుతుపవనాలు పూర్తిగా ముఖం చాటేయడంతో పాటు.. కర్ణాటక ప్రభుత్వం కావేరీ జలాలను విడుదల చేయకపోవడంతో గత 140 యేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం కరవు కోరల్లో చిక్కుకుంది. దీంతో లక్షలాది మంది రైతులు, రైతు కూలీలు ఉపాధిని కోల్పోయి ఓ పూట భోజనం కోసం అల్లాడుతున్నారు. ఈ కరవు వల్ల సుమారు 400 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. 
 
ముఖ్యంగా ఒక నెల రోజుల వ్యవధిలో 106 మంది అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడటంతో రైతులు ఆందోళన చెంది ఢిల్లీలో నిరసనకు దిగారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్లో ఎక్కువ మంది తీసుకున్న రుణాలు చెల్లించలేక చనిపోయారు. దీంతో తక్షణం రుణ మాఫీ చేయాలని ఆందోళన చేస్తున్న రైతుల ప్రధాన డిమాండ్‌గా ఉంది. 
 
మరోవైపు కరవు పీడిత జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం 32,30,191 మంది రైతులకు రూ.2247 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. దీనిపై రైతులు స్పందిస్తూ ఒక ఎకరాకు రూ.45 వేల అప్పు ఉందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం రూ.3 వేల ఆర్థిక సాయం ఇస్తే ఎలా సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు. అందువల్ల ప్రభుత్వం రుణాలు చెల్లించేందుకు కనీస మొత్తాన్ని ప్రభుత్వం సాయం చేయాలని కోరారు.