మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 23 మే 2015 (07:54 IST)

తమిళనాడు బిజీబిజీ... ఉరుకులు పరుగులు.. నేడు జయలలిత ప్రమాణస్వీకారం..

తమినాడులో ఒకవైపు అధికారులు మరోవైపు రాజకీయ నాయకులు బిజీబిజీగా ఉన్నారు. ఉరుకులు పరుగులు పెడుతున్నారు. అమ్మ జయలలిత ప్రమాణస్వీకారానికి పండగ వాతావరణం నెలకొంది. ఒకవైపు రాష్ట్రం నలుమూలల నుంచి జనం చెన్నై చేరుకుంటుంటే మరోవైపు రాజకీయ నాయకులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఇంకో వైపు అధికారులు  ప్రమాణస్వీకారానికి అవసరమైన అన్ని పత్రాలను సిద్ధం చేస్తున్నారు. 
 
శనివారం ఉదయం 11గంటలకు మద్రాస్ యూనివర్శిటీ ఆడిటోరియంలో ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించనున్నారు. అమ్మ నిర్ణయించిన 28 మంది మంత్రులు కూడా ప్రమాణం చేస్తారు. శుక్రవారం తమిళనాట కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉదయం ఏడు గంటలకే పార్టీ ప్రధాన కార్యాలయంలో 148 మంది ఎమ్మెల్యేలు సమావేశమై జయను శాసనసభా పక్ష నేత(ఎల్పీ)గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
 
అదే సమావేశంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు పన్నీర్ సెల్వం ప్రకటించారు. పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో జయ పేరును పన్నీర్ సెల్వమే ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ భేటీకి విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకేకు చెందిన ఏడుగురు రెబల్ ఎమ్మెల్యేలు కూడా హాజరై జయకు మద్దతుగా నిలిచారు.
 
ఈ సమావేశం తర్వాత పన్నీర్ సెల్వం తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు. మధ్యాహ్నం 2.15 గంటలకు జయలలిత రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్ కె.రోశయ్యకు కొత్త మంత్రుల జాబితాను అందజేశారు.  పన్నీర్ సెల్వం రాజీనామాతోపాటు కొత్త మంత్రుల జాబితాను ఆమోదించినట్లు రాజ్‌భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక అక్కడ నుంచి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు మరింత వేగంగా జరిగాయి. శనివారం ఉదయం నుంచే భద్రతా ఏర్పాట్లు భారీ ఎత్తున జరిగాయి.