శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 12 మే 2015 (18:36 IST)

జయలలిత కేసులో సుప్రీంకోర్టులో అప్పీల్ చేయండి : తమిళ రాజకీయ పార్టీలు!

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను నిర్దోషిగా ప్రకటించడాన్ని తమిళనాడు రాజకీయ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. పైగా.. కోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఈ క్రమంలో జయలలిత కేసులో కర్ణాటక హైకోర్టు ప్రకటించిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని తమిళ పార్టీలు కోరాయి. 
 
డీఎంకే అధినేత కరుణానిధి సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి ఈ మేరకు విన్నవించాయి. సీబీఐ ప్రత్యేక కోర్టు, హైకోర్టు తీర్పుల్లో చాలా వ్యత్యాసముందని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇళంగోవన్ అభిప్రాయపడ్డారు. కాబట్టి కర్ణాటక ప్రభుత్వం అప్పీలు చేయాలని కోరారు. అయితే జయ కేసులో హైకోర్టు తీర్పును తాను ఊహించలేకపోయానని డీఎండీకే చీఫ్, అసెంబ్లీ విపక్ష నేత, సినీనటుడు విజయకాంత్ అభిప్రాయపడ్డారు. 
 
అలాగే, పీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాస్ కూడా విస్మయం వ్యక్తం చేశారు. ఏ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని హైకోర్టు తీర్పు చెప్పిందో అర్థం కావడం లేదన్నారు. నేరానికి సంబంధించిన ఆధారాలు అనేకం కళ్లెదుటే కనిపిస్తున్నా నిర్దోషులుగా ప్రకటించడం శోచనీయమన్నారు. ఇది న్యాయదేవతను ఓడించడమేనని రాందాస్‌ వ్యాఖ్యానించారు.