గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 24 ఆగస్టు 2016 (14:16 IST)

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అమ్మాయిలకు డిమాండ్.. ఎందుకు తెలుసా?

వచ్చే యేడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే ముమ్మర ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. అదేసమయంలో ఎన్నికల ప్రచారంలో డ్యాన్సుల

వచ్చే యేడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే ముమ్మర ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. అదేసమయంలో ఎన్నికల ప్రచారంలో డ్యాన్సులు వేసేందుకు అమ్మాయిల అక్రమ రవాణా కూడా జోరుగా సాగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను బలవంతంగా ఇక్కడకు తీసుకొస్తున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. 
 
ఛత్తీస్‌గఢ్ నుంచి ఇలాంటి అవసరం కోసమే తీసుకొచ్చిన 32 మంది అమ్మాయిలను అలహాబాద్‌లో పోలీసులు రక్షించారు. దీంతో యూపీలో డాన్సు చేయిస్తున్న అమ్మాయిలంతా ముంబైలోని లైసెన్సుడు బార్ల నుంచి వచ్చిన డాన్స్ గర్ల్స్ మాత్రమే కాదని తెలుస్తోందని పోలీసులు అంటున్నారు. అమ్మాయిల అక్రమ రవాణాను నిరోధించేందుకు కృషిచేస్తున్న శక్తివాహిని అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన రిషికాంత్ యూపీలో ఈ వ్యవహారంపై గట్టిగా పోరాడుతున్నారు.
 
ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఎలాంటి ఫంక్షన్లు జరిగినా వాటిలో అమ్మాయిల డాన్సులు సర్వసాధారణం. పిల్లలు పుట్టినప్పుడు, పెళ్లిళ్లలో కూడా వీటిని ఏర్పాటుచేస్తారు. అయితే ఎన్నికల సమయంలో తమ ర్యాలీలకు జనాన్ని ఆకట్టుకోడానికి రాజకీయ నాయకులు చాలా పెద్ద స్థాయిలో ఈ డాన్సులు ఏర్పాటుచేస్తారు. అలహాబాద్‌లో శక్తివాహిని సంస్థ సాయంతో పోలీసులు రక్షించిన 32 మంది అమ్మాయిల్లో 14 ఏళ్ల బాలిక కూడా ఉంది. తమతో అర్థరాత్రి వరకు డాన్సులు చేయిస్తున్నారని, డ్రగ్స్ ఇచ్చి ఆ తర్వాత విటుల వద్దకు పంపుతున్నారని కొందరు అమ్మాయిలు తెలిపారు.