శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 డిశెంబరు 2020 (21:30 IST)

మాస్కులు ధరించలేదా?... కరోనా కేంద్రాల్లో సేవ చేయించండి : గుజరాత్ హైకోర్టు?

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైన చర్యలు చేపడుతున్నాయి. ఇందులోభాగంగా, ముఖానికి మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. అయితే, అనేక మంది ముఖానికి మాస్కులు ధరించడం లేదు. దీనిపై గుజరాత్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. మాస్క్‌ ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతూ పట్టుబడిన వారు కరోనా కేంద్రంలో సేవ చేయాలని తెలిపింది. 
 
విశాల్‌ అవతాపి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన గుజరాత్‌ హైకోర్టు ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారు కరోనా కేంద్రాల్లో నాలుగు నుంచి 5 గంటల పాటు సుమారు ఐదు నుంచి 15 రోజుల వరకు నాన్‌ మెడికల్‌ విధులు నిర్వహించాలని సూచించింది. 
 
క్లీనింగ్‌, హౌ‌స్‌కీపింగ్‌, కుకింగ్‌, హెల్పింగ్‌, సర్వింగ్‌, రికార్డుల తయారీ, రికార్డులను భద్రపర్చడం వంటి పనులను మాస్కులు ధరించవారితో చేయించాలని పేర్కొంది. జరిమానా విధించడంతోపాటు వ్యక్తుల వయసు, విద్యార్హత, జండర్‌, హోదా ప్రకారం ఆయా సేవలు అప్పగించాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఒక విధానాన్ని రూపొందించి ఈ నెల 24న నివేదిక సమర్పించాలని ఆదేశించింది.