శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (15:28 IST)

మీరు 'గొడ్డు మాంసం' తినకుండా ఉండలేరా.. అయితే మా రాష్ట్రంలోకి రావొద్దు : హర్యానా మంత్రి అనిల్ విజ్

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలకెక్కే హర్యానా రాష్ట్ర ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ మరోమారు వార్తలకెక్కారు. గొడ్డు మాంసం (బీఫ్) తినకుండా ఉండలేని వారు హర్యానా రాష్ట్రంలో అడుగుపెట్టవద్దంటూ ఆయన సూచించారు. గతంలో గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెల్సిందే. ఇపుడు మరోమారు బీఫ్ ప్రియులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారేన్నే రేపుతున్నాయి.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ తమ రాష్ట్రంలో గోవధపై నిషేధం అమలవుతోందని, అందువల్ల ఇకపై బీఫ్‌ విక్రయాలకు సంబంధించి ఎలాంటి లైసెన్స్‌ ఇచ్చే అవకాశం లేదని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తేల్చ స్పష్టం చేశారని, బీఫ్‌ తినకుండా ఉండలేనివాళ్లు హర్యానా రాష్ట్రంలోని రాకుండా ఉంటే మంచిదని మంత్రి అనిల్‌ విజ్‌ వ్యాఖ్యానించారు. పైగా అనేక దేశాల్లో మన వంటకాలు లేవని ఆయన గుర్తు చేశారు. 
 
ఈ వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి.  ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. ముఖ్యమంత్రి ఖట్టర్‌ ఒక మాట మాట్లాడితే ఆయన మంత్రి వర్గ సహచరులు మరో మాట మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. రాష్ట్రంలో గొడ్డు మాంసంపై నిషేధం ఉన్నప్పటికీ విదేశీయులకు మినహాయింపు ఇస్తామని సీఎం ఇచ్చిన హామీని కాంగ్రెస్‌ గుర్తు చేసింది.