శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 24 నవంబరు 2014 (14:51 IST)

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జయలలితదే విజయం!!

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ సీఎం జయలలితపై ప్రజలకు సానుకూలత ఉందని తాజా అధ్యయనం తేల్చింది. జయలలిత జైలుకు వెళ్లడంతో ఆమె ప్రతిష్ట, పార్టీ ప్రతిష్ట తగ్గిందని, అలాగే కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే పార్టీ ఏమాత్రం ప్రభావం చూపే పరిస్థితి కనిపించడం లేదని జోరుగా ఊహాగానాలు వినిపించాయి.
 
అలాగే, రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందని, దీనిని బీజేపీ సొమ్ము చేసుకోవాలని భావిస్తోందని, అందుకే రజనీకాంత్, విజయ్ వంటి హీరోల వైపు చూస్తోందని జోరుగా ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. 
 
అయితే, ఇదంతా తూచ్.. అంటోంది సర్వే! ఇప్పటికిప్పుడు తమిళనాడులో ఎన్నికలు జరిగితే మళ్లీ జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే పార్టీయే గెలుస్తుందని తేలింది.
 
ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అన్నాడీఎంకే 43 శాతం, డీఎంకే 26 శాతం, భారతీయ జనతా పార్టీ 9 శాతం ఓట్లను సాధిస్తుందని తేలింది. 
 
ఆస్తుల కేసులో ఇరుక్కొని జైలుకు వెళ్లి వచ్చిన జయ పైన తమిళనాడు ప్రజలు సానుభూతితో ఉన్నారని తేలింది. అయితే, ఆమె సీఎం పీఠం నుండి దిగిన తర్వాత.. పన్నీరుసెల్వం ప్రభుత్వం తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారని తేలింది.
 
సర్వే ప్రకారం.. అదే సమయంలో ప్రజలు బీజేపీ వైపు ఆకర్షితులు అవుతున్నారు. తమిళనాడులోను మోడీ హవా కనిపిస్తోంది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో మూడో పెద్ద పార్టీగా బీజేపీ అవతరించనుంది.
 
జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ బాగుందని 58 శాతం మంది చెప్పారు. ఆరు శాతం మంది బాగా లేదని చెప్పారు. పన్నీరు సెల్వం ప్రభుత్వం బాగా లేదని 35 శాతం మంది చెప్పారు.
 
రజనీకాంత్ కొత్త పార్టీ పెట్టవచ్చునని 17 శాతం మంది, హీరో విజయ్ పార్టీ పెట్టవచ్చునని 21 శాతం మంది అభిప్రాయపడ్డారు. చాలామంది రజనీకాంత్, విజయ్‌లను రాజకీయాల్లో కూడా చూడాలనుకుంటున్నారు. కానీ తమిళనాడులో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయని వేచి చూడాల్సిందే.