శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2015 (07:36 IST)

అన్నా. ఆశీర్వదించు...! చెల్లీ... నీకు నేనున్నా...!! నేడు రక్షా బంధన్

ప్రతీ అన్నకు ఓ చెల్లి కావాలి.... ప్రతీ చెల్లికి ఓ అన్న తోడుండాలి. అదే భారతదేశం సంస్కృతి... సొంత అన్న లేకపోయినా తాను రాఖీ కట్టడానికి ఓ చెల్లి పరుగులు పెడుతుంది. చెల్లి లేకపోయినా కోరిన వారికి చేయినందిస్తూ నేనున్నాని అన్న ఎదురు చూస్తాడు. ఈ పండుగకు అంతటి ప్రాధాన్యత ఉంది. సోదరుడు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలన్న కోరికతో సోదరి అతడి చేతికి రాఖీ కడుతుంది. అందుకు ప్రతిగా ఆమెను జీవితాంతం భద్రంగా చూసుకునే బాధ్యతను సోదరుడు స్వీకరిస్తాడు.
 
శ్రావణ మాస పౌర్ణమి రోజు చేసుకునే ఈ పండుగను ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో జరుపుతారు. మారిషస్‌, నేపాల్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లాంటి కొన్ని ప్రాంతాల్లో ఈ వేడుక జరుగుతుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఉన్నభారతీయులు కూడా ఈ పండుగను చేసుకొంటారు. ప్రధానంగా హిందువులు, సిక్కులు, జైనులు రాఖీ పౌర్ణమిని జరుపుకొంటారు.
 
దేవతలకు, రాక్షసులకు ఒకసారి యుద్ధం జరుగుతున్నప్పుడు ఇంద్రుడు వారిని నిలువరించ లేకపోయాడట. అప్పుడు ఆయన భార్య అయిన శచీదేవి విష్ణువుని శరణు కోరగా ఆయన ఒక దారపు పూసలతో కూడిన రక్షా బంధనాన్ని ఆమెకు ఇచ్చాడట. దాన్ని ఆమె ఇంద్రుడికి కట్టడంతో యుద్ధాన్ని జయించాడట. ఈ రక్షా బంధనాన్ని కట్టడం కేవలం అన్నా చెల్లెళ్ల అనుబంధానికి సంబంధించింది మాత్రమే కాదని గతంలో ఎవరి రక్షణ కోసమైనా మహిళలు పూజించి కట్టేవారని అది కాల క్రమంలో స్త్రీలు తమ సోదరులకు కట్టే సంప్రదాయంగా మారిందని ప్రతీతి.
 
విష్ణు పురాణంలో మరో కథ కూడా ఉంది. బలి చక్రవర్తి ఓ సారి తపస్సు చేసి విష్ణు మూర్తిని ప్రసన్నం చేసుకున్నాడట. ఏం వరం కావాలో విష్ణువు కోరుకోమనగా, మీరు నా మందిరంలోనే ఉండిపోవాలని బలి వరమడిగాడు. విష్ణువు వరమిచ్చి బలిచక్రవర్తి అంతఃపురంలోనే ఉండిపోయాడట. అయితే తన భర్తను ఎలాగైనా వైకుంఠానికి తీసుకువెళ్లాలని లక్ష్మీ దేవి భావించింది.
 
ఈ నేపథ్యంలో బలిని సోదరుడిగా భావించి రక్షా బంధన్‌ కడుతుంది. అందుకు ప్రతిగా ఏం కావాలో కోరుకోమని బలి చక్రవర్తి అడుగుతాడు. అప్పుడు లక్ష్మీదేవి తన భర్తను వైకుంఠానికి తీసుకువెళతానని అడగ్గా సరేనంటాడు. అందుకే శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకొంటారని పురాణ గాథ. గాథలు ఏమైనా ఆధునిక యుగంలో కూడా అన్న కోసం చెల్లి.. చెల్లి రక్షా బంధన్ కోసం అన్న ఎదురు చూస్తూనే ఉన్నారు. రక్షా బంధన్ కట్టడానికి ఎగబడుతూనే ఉన్నారు.