శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 6 మార్చి 2017 (08:52 IST)

విమానాల్లోనూ టాయ్‌లెట్ కంపే.. స్వచ్చభారత్ అంతవరకు పాకింది.. ఏం దరిద్రమో...

టాయెలెట్ కంపు భరించలేక ఒక విమానం గాల్లోకి ఎగిరిన కాస్సేపటికే మళ్లీ దిగిపోయిన ఘటన ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా ఒక్క మన దేశంలో తప్ప.. ఏమా కథ. ఏమా కంపు. ఏమా గగన ఘన ప్రయాణం..!

ఒకవైపు ప్రధాని నరేంద్రమోదీ స్వచ్ఛభారత్ పేరిట ఇచ్చిన పిలుపు ఒక రేంజిలో పేలింది. ఇండియా షైనింగ్ కాదు.. ఇండియా క్లీనింగ్ అనే స్థాయిలో ప్రచారం జరిగిపోయింది. కానీ ఒక వైపు మన బస్టాండులు, రైళ్లు, స్టేషన్లు మురికికంపులో మాకెవరు పోటీ అంటూ పాట పాడుతూనే ఉన్నాయి. ఆ ఘనతంతా మీకే అయితే ఎలా మేమూ కాస్త పంచుకుంటాం అంటూ ఇప్పుడు విమానాలూ వాలిపోయాయి. టాయెలెట్ కంపు భరించలేక ఒక విమానం గాల్లోకి ఎగిరిన కాస్సేపటికే మళ్లీ దిగిపోయిన ఘటన ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా ఒక్క మన దేశంలో తప్ప.. ఏమా కథ. ఏమా కంపు. ఏమా గగన ఘన ప్రయాణం..!
 
సాధారణంగా బస్టాండ్లలో టాయిలెట్లు కంపు కొడితే వాటికి దూరంగా వెళ్లి నిలబడతాం. అదే రైళ్లలో అయితే అటువైపు వెళ్లడం మానేసి ఊరుకుంటాం. కానీ వేలకు వేలు పోసి టికెట్లు కొనుక్కున్న విమానంలోనే టాయిలెట్లు కంపు కొడితే.. లోపల ఉన్నవాళ్లు అసలు భరించే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు తప్పనిసరిగి విమానాన్ని దించేయాల్సి ఉంటుంది. తాజాగా ఓ స్పైస్‌జెట్ విమానంలో ఇలాగే జరిగింది.
 
బెంగళూరు నుంచి ఢిల్లీకి ఓ విమానం బయల్దేరింది. అందులో 188 మంది ప్రయాణికులున్నారు. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే టాయిలెట్ నుంచి ఘోరమైన దుర్వాసన వస్తోందని చాలామంది ఫిర్యాదు చేశారు. కాసేపటికి అది ఇక భరించలేని స్థితికి చేరుకుంది. చివరకు సిబ్బంది కూడా తమ వల్ల కాదని చేతులెత్తేశారు. దాంతో.. ఇక అక్కడకు సమీపంలోనే ఉన్న హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో విమానాన్ని దించేశారు. 
 
ఏకంగా టాయలెట్ నుంచి కాక్‌పిట్ వరకు కూడా దుర్వాసన వచ్చేయడంతో స్పైస్‌జెట్ విమానం బి-737ను హైదరాబాద్‌లో దించేయాల్సి వచ్చిందని స్పైస్‌జెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. హైదరాబాద్‌లో ల్యాండయిన తర్వాత మొత్తం అంతా శుభ్రం చేసి, బాగా గాలి ఆడనిచ్చి ఆ తర్వాత విమానాన్ని నడిపించినట్లు వివరించారు.