శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : బుధవారం, 4 మార్చి 2015 (09:06 IST)

త్వరలోనే ఎవరి హైకోర్టు వాళ్లకు.. వెంకయ్య హామీ..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధి విధానాలపై వీలైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం లోక్‌సభలో హామీ ఇచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపి జితేందర్‌రెడ్డి ప్రతిపాదించిన వాయిదా తీర్మానంపై వెంకయ్యనాయుడు ఈ హామీనిచ్చారు.
 
ఏపీ విభజన చట్టం లో ఉమ్మడి హైకోర్టును విభజించాలని స్పష్టంగా ఉందనీ,ఈ విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే తమ నేత తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రిని, సుప్రీం కోర్టు, హైకోర్టు చీఫ్ జస్టిస్‌లను కూడా కలిశారని అన్నారు. హైకోర్టు విభజన పూర్తయ్యాకే జూనియర్ జడ్జీల నియామకాలను చేపట్టాలని కోరినా.. న్యాయస్థానాలు అంగీకరించలేదని పేర్కొన్నారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వివరణ ఇచ్చారు. 
 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ప్రత్యేక హైకోర్టు ఉండాలన్న వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను. ఈ విషయాన్ని న్యాయమంత్రి పరిశీలిస్తున్నారని చెప్పారు. మరో ఎంపీ బి.వినోద్‌కుమార్ మాట్లాడుతూ హైకోర్టు విభజనపై మంత్రి సదానందగౌడ నాకు లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం నుంచిగానీ, ఉమ్మడి హైకోర్టు నుంచిగానీ ప్రతిపాదనకు జవాబు రాలేదని పేర్కొన్నారని చెప్పారు. వారి నుంచి సమాధానం వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు.