శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (13:52 IST)

టీటీవీ దినకరన్ అరెస్టుకు రంగం సిద్ధం?.. సీఆర్‌పీఎఫ్ భద్రత కోరిన ఢిల్లీ పోలీసులు

అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. అన్నాడీఎంకే అధికారిక ఎన్నికల గుర్తు రెండు ఆకులను కాపాడుకోవడానికి ఆయన ఏకంగా ఎన్నికల సంఘానికే లంచం ఇవ్వజూపినట్టు ఢిల్లీ క్రై

అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. అన్నాడీఎంకే అధికారిక ఎన్నికల గుర్తు రెండు ఆకులను కాపాడుకోవడానికి ఆయన ఏకంగా ఎన్నికల సంఘానికే లంచం ఇవ్వజూపినట్టు ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు ఏ క్షణమైనా ఢిల్లీకి వచ్చి దినకరన్‌ను అదుపులోకి తీసుకోవచ్చన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. 
 
మరోవైపు ఈ కేసులో అరెస్టు కావడం తథ్యమని తేలడంతో టీటీవీ దినకరన్ హడలి పోతున్నారు. తనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయడంతో పరుగుపరుగున బెంగుళూరుకు వెళ్లి.. జైలులో ఉన్న పిన్నితో మాట్లాడాలని దినకరన్ భావించారు. అయితే, శశికళను కలుసుకునేందుకు బెంగుళూరు జైలు అధికారులు అనుమతించలేదు. అలాగే, దినకరన్‌ను కలుసుకునేందుకు శశికళ కూడా విముఖ చూపినట్టు సమాచారం. దీంతో ఆయన చెన్నైకు తిరుగుపయనమయ్యారు. 
 
ఇంకోవైపు ఈ లంచం కేసులో తనను అరెస్టు చేయడం తథ్యమని తేలడంతో దినకరన్ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. ఒకవేళ కోర్టులోగానీ ఆయనకు చుక్కెదురైతే ఢిల్లీ పోలీసులు తక్షణం అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదిలావుండగా, దినకరన్‌ను అదుపులోకి తీసుకునేందుకు చెన్నైకు వెళ్లే తమకు సీఆర్‌పీఎఫ్ భద్రత కల్పించాలని ఢిల్లీ పోలీసులు కేంద్రాన్ని కోరినట్టు వార్తలు వస్తున్నాయి.