గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2017 (11:21 IST)

దినకరన్ ఏజెంట్ సుకేష్ మామూలోడు కాదు... అమ్మాయిలు సరఫరా... కన్నడ నటి లీనాతో సహజీవనం...

రెండాకుల గుర్తు కోసం ఎన్నికల సంఘానికి లంచం ఇచ్చేందుకు అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌ నియమించుకున్న మధ్యవర్తి సుకేష్ చంద్రశేఖర్ తక్కువోడేం కాదు. రాజకీయ నేతలకు అమ్మాయిలను సరఫరా చేసేవాడు.

రెండాకుల గుర్తు కోసం ఎన్నికల సంఘానికి లంచం ఇచ్చేందుకు అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌ నియమించుకున్న మధ్యవర్తి సుకేష్ చంద్రశేఖర్ తక్కువోడేం కాదు. రాజకీయ నేతలకు అమ్మాయిలను సరఫరా చేసేవాడు. అలాగే, వీలు చిక్కితే ఆ రాజకీయ నేతలనే బురిడీ కొట్టించేవాడు. చివరకు ఓ కన్నడ నటితో సహజీవనం కూడా చేశాడు. అలా పెద్ద నేర చరిత్రే ఉంది. అతని నేర చరిత్ర కర్ణాటక రాజధాని బెంగళూరులోనే ప్రారంభమైంది. 
 
చిన్ననాడే అతను నేరాల బాట పట్టాడు. అతను 19 ఏళ్ల వయస్సులోనే జైలుకు వెళ్లాడు. బెంగళూరులోని చంద్రప్ప లేఔట్‌కు చెందిన సుకేష్ 19 ఏళ్ల వయస్సులో జైలుకు వెళ్లి వచ్చి మోసాలు చేయడంలో మునిగిపోయాడు. ముఖ్యమంత్రులకు, ఎంపీలకు తాను అత్యంత సన్నిహితుడిని అంటూ ఖరీదైన కార్లలో తిరుగుతూ పెద్ద పెద్ద వాళ్లను కూడా బుట్టలో వేశాడని అంటారు.
 
అంతేనా... కన్నడ వర్ధమాన నటి లీనా పాల్‌తో స్నేహం చేశాడు. ఆ స్నేహం సహజీవనం వరకు వెళ్లింది. ఇద్దరు కలిసి చెన్నై, ముంబై వ్యాపారవేత్తలను కోట్ల రూపాయల మేరకు ముంచినట్లు కేసులు నమోదయ్యాయి. ఇద్దరు ఓ ఫామ్ హౌస్‌లో ఉండగా చెన్నై పోలీసులు వారిద్దరిని అరెస్టు చేశారు. అక్కడ వారికి అత్యంత ఖరీదైన మెర్సీడీస్ కార్లు లభించాయి. తాను జేడీఎస్ నేత కుమార స్వామి కుమారుడు నిఖిల్ గౌడకు సన్నిహిత మిత్రుడినని నమ్మించి మోసాలకు పాల్పడినట్లు కూడా ఫిర్యాదులు వచ్చాయి.
 
సుకేష్ బడా వ్యాపారవేత్తలను, రాజకీయ నేతలను మాత్రమే కాకుండా, సామాన్యులను కూడా వదలలేదు. బీడీఎల్‌లో పనులు పూర్తి చేయిస్తానని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని వ్యాపారవేత్తలను, సాధారణ ప్రజలను మోసం చేసినట్లు, వారి నుంచి కోట్లాది రూపాయలు రాబట్టుకున్నట్లు కూడా వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. 
 
ఫేస్‌బుక్ ద్వారా 2013లో కన్నడ చలనచిత్ర రంగానికి చెందిన తారలను పరిచయం చేసుకుని పెద్ద చిత్రాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ మోసం చేసినట్లు కూడా ఫిర్యాదులు అందాయి. సుకేష్‌ వందకు పైగా మోసాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందాయని, వాటిలో 25 నుంచి 30 వరకు కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. ఈ స్థితిలో సుకేష్ ఆగడాలను తెలుసుకునేందుకు ఢిల్లీ పోలీసులు బెంగళూరు వస్తారని సమాచారం.