గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 29 జులై 2014 (12:14 IST)

మత రాజకీయాలు.. వాళ్లు హీరోలే.. కర్ణాటక పోలీసులు తీవ్రవాదులు!

ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన శివసేన అధినేత ఉద్ధవ్‌ థాకరే వివాదాస్పద అంశాలను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రంజాన్‌ ఉపవాసాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నించిన ఎంపీలను హీరోలతో పోల్చిన ఉద్ధవ్‌.. ఇప్పుడు కర్నాటక పోలీసులను కరుడుగట్టిన తీవ్రవాదులతో పోల్చారు. 
 
విద్వేషాలు రెచ్చగొట్టైనా సరే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలని శివసేన భావిస్తోంది. ఇటీవల మహారాష్ట్ర సదన్‌లో చోటుచేసుకున్న ఘటనను కూడా మార్కెటింగ్‌ చేసుకునే ప్రయత్నం చేసింది. రంజాన్‌ ఉపవాసం భగ్నం చేసేందుకు ప్రయత్నించిన చిల్లర నాయకులను హీరోలంటూ ఉద్ధవ్‌ థాకరే సమర్థించారు. తాజాగా పార్టీకి చెందిన అధికారిక పత్రిక సామ్నా ఎడిటోరియల్‌లో రెండు రాష్ట్రాల మధ్య మరోసారి విద్వేషాలు రెచ్చగొట్టేలా సంచలన వ్యాఖ్యలు ప్రచురించారు. 
 
కర్నాటకలోని మరాఠా ప్రజల పట్ల అక్కడి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కరుడుగట్టిన తీవ్రవాదల చర్యలా ఉందన్నారు. కర్నాటక-మహరాష్ట్ర సరిహద్దును పాక్‌-భారత్‌ సరిహద్దులుగా మార్చుతున్నారని ఆరోపించారు. 
 
అయితే శివసేన కామెంట్లపై కన్నడవాసులు భగ్గుమంటున్నారు. దశాబ్దాలుగా కలిసిమెలిసి ఉంటున్న రెండు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యలు ఉన్నాయంటున్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం శివసేన రాద్దాంతం చేస్తోందని విమర్శలొస్తున్నాయి. ఈ పద్ధతి మార్చుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.