గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 22 జులై 2014 (11:34 IST)

ఎంహెచ్ 17 బ్లాక్‌బాక్స్‌లను అప్పగించిన ఉక్రెయిన్ రెబెల్స్!

ఉక్రెయిన్ - రష్యా సరిహద్దుల్లో క్షిపణి దాడితో కూల్చివేసిన ఎంహెచ్ 17 విమానం బ్లాక్‌బాక్స్‌ను అంతర్జాతీయ మీడియా ప్రతినిధుల సమక్షంలో మలేషియా ప్రభుత్వ నిపుణులకు ఉక్రెయిన్ తిరుగుబాటుదారులు సోమవారం అప్పగించారు. అలాగే, విమానం కూలిన ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టే నిమిత్తం పది కిలోమీటర్ల మేరకు కాల్పుల విరమణ పాటిస్తున్నట్టు ప్రకటించారు. 
 
ఎంహెచ్17 బ్లాక్ బాక్స్‌ను మలేషియా నిపుణులకు అందజేయాలని నిర్ణయించి, అప్పగించినట్టు తనను తాను ప్రధానమంత్రిగా ప్రకటించుకున్న దొనెట్‌స్క్ పీపుల్స్ రిపబ్లిక్‌కు చెందిన ఉక్రెయిన్ తిరుగుబాటు దళం అధిపతి అలెగ్జాండర్ బొరోడాయ్ మీడియా ప్రతినిధులకు చెప్పారు. అదేవిధంగా అంతర్జాతీయ పరిశీలకులు వచ్చేవరకు శవాలను తమ దగ్గరే జాగ్రత్తగా భద్రపరుస్తామని ఉక్రెయిన్ తిరుగుబాటుదారులు తెలిపారు. శవాలు పాడవకుండా ఉండాలనే ఉద్దేశంతో వాటిని ఏసీ రైల్ వ్యాగన్లలో భద్రపరిచామని వారు తెలియజేశారు.
 
మరోవైపు మలేసియా విమానం కూలిపోయిన ప్రదేశంలో కాల్పుల విరమణ పాటించాలని ఉక్రెయిన్ దళాలకు ఆ దేశాధ్యక్షుడు పొరొషెంకో ఆదేశాలు జారీ చేశారు. విమానం కూలిన ప్రదేశం రష్యన్ అనుకూల, ఉక్రెయిన్ వ్యతిరేక తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉందని ఆయన పేర్కొన్నారు. కాల్పుల విరమణతో మృతదేహాలు, సాక్ష్యాధారాల సేకరణ సులభమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్ దేశాధ్యక్షుడి ఆదేశాలతో విమానం కూల్చివేతకు గురైన ప్రదేశానికి 40 కిలోమీటర్ల వరకు కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని ఉక్రెయిన్ వర్గాలు వెల్లడించాయి.