గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 28 జులై 2014 (16:27 IST)

విచారణ ఖైదీపై కిరోసిన్ పోసి తగలబెట్టిన జైలర్!

బీహార్ రాష్ట్రంలో మరో ఘోరం చోటు చేసుకుంది. విచారణ ఖైదీని ఓ జైలర్ కిరోసిన్ పోసి నిలువునా తగులబెట్టేశాడు. రూపేష్ పాశ్వాన్ అనే వ్యక్తి ఆయుధాలు చట్టం కింద నాలుగేళ్లుగా నవడా జైల్లో విచారణ ఖైదీగా ఉన్నాడు. రూపేష్ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడని పేర్కొంటూ 80 శాతం కాలిన గాయాలతో తొలుత నవాడా సదార్ ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యుల సలహా మేరకు పాట్నా వైద్య కళాశాల ఆసుపత్రికి జైలు సిబ్బంది తరలించారు. 
 
అయితే, రూపేష్ పాశ్వాన్ మరణించే ముందు మెజిస్ట్రేట్‌కు వాంగ్మూలమిస్తూ జైలులో నాణ్యమైన భోజనం పెట్టాలని గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నందుకు ప్రతీకారంగా జైలర్ లాల్ బాబూ సింగ్, అతడి సహచరులు గోపీ యాదవ్, బ్రహ్మ యాదవ్ తనపై కిరోసిన్ పోసి తగులబెట్టేశారని తెలిపి మరణించాడు. దీంతో మేజిస్ట్రేట్ ఆ విధంగానే వాంగ్మూలాన్ని నమోదు చేశాడు. దీనిపై జిల్లా మేజిస్ట్రేట్ లాలన్ జీ స్పందిస్తూ.. ఖైదీ ఇచ్చిన మరణ వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు.