గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 28 ఫిబ్రవరి 2015 (12:49 IST)

బడ్జెట్ 2015-16 : ధరలు పెరిగేవి .. ధరలు తగ్గేవి ఏవి?

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2015-16 వార్షిక బడ్జెట్‌ తర్వాత పలు రకాల వస్తు ఉత్పత్తుల ధరల్లో మార్పు రానుంది. ప్రధానంగా ధరలు పెరిగే ఉత్పత్తులలో, సిగరెట్లు, బీడీలు, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులు, దిగుమతి చేసుకునే ఖరీదైన కార్లు, హై ఎండ్ మొబైల్ ఫోన్లు, భారీ సైజులో ఉండే టీవీలు, సెంట్లు తదితర వస్తువులు ఉన్నాయి.
 
అలాగే, 22 రకాల వస్తువులపై కస్టమ్స్ సుంకాలు తగ్గించడంతో, వీటి ధరలు దిగిరానున్నాయి. ధర తగ్గనున్న ఉత్పత్తులలో వంట సామాగ్రి, తక్కువ ధర స్మార్ట్ ఫోన్‌లు, సబ్బులు, ఆభరణాలు, బెల్టులు, షూస్ వంటి లెదర్ ఉత్పత్తులు, రెడీ మేడ్ దుస్తులు తదితర వస్తు ఉత్పత్తులు ఉన్నాయి. 
 
అదేవిధంగా ఈ బడ్జెట్లో అరుణ్ జైట్లీ ధనవంతులపై కరుణ చూపారు. ప్రస్తుతం వసూలు చేస్తున్న 30 శాతం కార్పొరేట్ పన్నును 25 శాతానికి తగ్గించాలని జైట్లీ ప్రతిపాదించారు. దీంతో ధనికులు మరింత ధనవంతులుగా మారే అవకాశాలు పెరిగాయి. భారత్‌లో 30 శాతం కార్పొరేట్ పన్ను వసూలు కావటం లేదని పార్లమెంట్‌కు తెలిపిన ఆయన, దాని వల్ల ఎంతో ఆదాయన్ని నష్టపోతున్నామని పేర్కొన్నారు. అందుకే దీన్ని 25 శాతానికి తగ్గించినట్టు తెలిపారు.