శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 7 జులై 2015 (13:39 IST)

వివాహేతరబంధంతో పుట్టిన పిల్లల బర్త్ సర్టిఫికేట్‌లో తండ్రిపేరు అక్కర్లేదు: సుప్రీంకోర్టు

అవివాహితులు పెట్టుకునే అక్రమసంబంధం కారణంగా పుట్టే పిల్లలకు జారీచేసే జననధృవీకరణ పత్రాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. ఈ తరహా పిల్లలకు జారీ చేసే సర్టిఫికేట్లలో తండ్రి పేరు చెప్పాలంటూ ఒత్తిడిచేయాల్సిన అవసరంలేదని, తల్లి పేరు రాస్తే సరిపోతుందని స్పష్టంచేసింది. 
 
మంగళవారం జరిగిన ఓ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుచేసింది. ఇటీవలికాలంలో మహిళలు తమ పిల్లలను ఎవరి సాయమూ లేకుండానే పెంచి పెద్దచేసే శక్తిని సంపాదించుకుంటున్నారని, అందువల్ల మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాలూ మారాల్సి వుందని అభిప్రాయపడింది. 
 
బిడ్డ తల్లి విషయంలో ఏ విధమైన అనుమానాలూ ఉండవని, అందువల్లే తల్లి ఒక్కరే లేదా అవివాహిత తల్లి కూడా జనన ధృవీకరణపత్రం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అయితే, బిడ్డకు తల్లి ఆమేనన్న ధృవపత్రాన్ని మాత్రం ఆసుపత్రి నుంచి లేదా అఫిడవిట్ రూపంలో అందించాల్సి ఉంటుందన్నారు. తల్లిదండ్రుల బంధం తెగిపోయిందన్న కారణంతో ఏ చిన్నారి కూడా అశ్రద్ధకు గురికాకూడదన్న ఉద్దేశంతో ఈ ఆదేశాలు ఇస్తున్నట్టు ధర్మాసనం తెలిపింది.