బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2015 (08:39 IST)

ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళితే వివస్త్రలను చేసిన యూపీ ఖాకీలు!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడా పరిధిలో మరో దారుణం జరిగింది. తమ ఇంట్లో దొంగతనం జరిగిందంటూ ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళ్లిన ఓ కుటుంబాన్ని రక్షక భటులు వివస్త్రలను చేసి అవమానించి పంపించారు. అంతేనా, వారిపట్ల దురుసుగా ప్రవర్తిస్తూ.. రోడ్డుపైకి ఈడ్చి తన్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
గ్రేటర్ నోయిడాలోని అట్టా ప్రాంతంలో నివసించే సునీల్‌ గౌతమ్‌ అనే దళితుడి ఇంట్లో బుధవారం రాత్రి దొంగలు పడ్డారు. దీంతో అతడు ఫిర్యాదు చేసేందుకు గురువారం దాంకౌర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తన భార్యతో సహా వెళ్లాడు. కానీ, స్టేషన్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ యాదవ్‌ తమ ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించడంతో.. స్టేషన్‌ బయట తాను తన కుటుంబసభ్యులతో సహా నిరసనకు దిగారు. 
 
ఇది పోలీసులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఒక దళిత కుటుంబ సభ్యులు తమను వ్యతిరేకిస్తూ నిరసనకు దిగడమా అంటూ పోలీసులు తీవ్ర అసహనానికి గురికావడమే వారిలోని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతే పోలీసులు ఆ దళిత కుటుంబ సభ్యులను చుట్టిముట్టి.. దుస్తులను చింపేసి.. ఈడ్చిపారేశారు. 
 
ఆసమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ ఘటన మొత్తాన్నీ తన మొబైల్‌లో చిత్రీకరించి ఆన్‌లైన్‌లో పెట్టడంతో... పోలీసుల వైఖరిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటన అనంతరం పోలీసులు ముగ్గురు మహిళలు సహా ఐదుగురిని అరెస్టు చేసినట్టు, వారిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టినట్టు స్థానిక పత్రిక ఒకటి వెల్లడించింది. 
 
పోలీసులు అరెస్టు చేసినవారిలో సునీల్‌ దంపతులు కూడా ఉన్నట్టు సమాచారం. కాగా.. ఈ ఘటనపై యూపీ సర్కారు అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా స్పందించింది. జరిగిన ఘటన తాలూకూ వీడియో పోలీసుల వద్ద ఉందని.. సునీల్‌ గౌతమ్‌ దంపతులు తమంత తామే దుస్తులు విప్పుకొన్నట్టుగా వీడియోలో స్పష్టంగా ఉందని వివరణ ఇవ్వడం గమనార్హం.