గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 5 మే 2016 (15:12 IST)

కరవుకు ప్రత్యేక ప్యాకేజీ నిధులివ్వండి.. అంతేకానీ నీటి రైలు వద్దు : యూపీ అధికారులు

కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరప్రదేశ్ అధికారులు ఝులక్ ఇచ్చారు. తీవ్రమైన నీటి ఎద్దడితో అల్లాడుతున్న ప్రాంతానికి పది నీటి వ్యాగన్లతో రైలును పంపించగా, అధికారులు మాత్రం రైలును అడ్డుకుని నీరు వద్దని వెనక్కి పంపించేశారు.
 
మహారాష్ట్రలో ఇదేవిధంగా నీటి ఎద్దడి నెలకొనడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం నీటి రైలును పంపించిన విషయం తెల్సిందే. అలాగే, బుందేల్‌ఖండ్‌లోని మహోబా ప్రాంతంలో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో 10 నీటి వ్యాగన్లతో రైలు గురువారం రాష్ట్రంలోని ఝాన్సీ ప్రాంతానికి చేరుకుంది. షెడ్యూల్‌ ప్రకారం మే 6న శుక్రవారం రైలు మహోబాకు చేరుకోవాల్సి ఉంది. 
 
అయితే ఝాన్సీలో అధికారులు రైలును అడ్డుకున్నారు. తమకు నీటి రైలు అవసరం లేదని వారు తేల్చి చెప్పడంతో రైలు వెనక్కి మళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుందేల్‌ఖండ్‌లో విపరీతమైన నీటి ఎద్దడి ఉందని.. నీటి రైలును పంపి ప్రజలకు సహాయడనున్నట్లు కేంద్ర రైల్వేమంత్రి సురేష్‌ ప్రభు బుధవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 
 
మరోవైపు ఈనెల 7వ తేదీ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ ప్రధాని నరేంద్ర మోడీని కలిసి బుందేల్‌ఖండ్‌లో కరవు, నీటి ఎద్దడి గురించి చర్చించనున్నారు. కరవు కారణంగా బుందేల్‌ఖండ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ కూడా ప్రకటించింది. అయినప్పటికీ కేంద్ర పంపిన నీటి రైలును మాత్రం అధికారులు తిరస్కరించడం గమనార్హం.