గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 28 మే 2016 (17:51 IST)

పుదుచ్చేరి రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా వి.నారాయణ స్వామి

రాష్ట్ర హోదా కలిగిన కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరి కొత్త ముఖ్యమంత్రిగా వి.నారాయణ స్వామి ఎంపికయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆయన పేరును సిఫార్సు చేసింది. దీంతో ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. 
 
ఈనెల 19వ తేదీన వెల్లడైన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి 15 అసెంబ్లీ సీట్లు రాగా, మిత్రపక్షమైన డీఎంకేకు రెండు సీట్లు వచ్చాయి. దీంతో మొత్తం 30 సీట్లున్న పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమైంది. 
 
అయితే, ముఖ్యమంత్రి ఎవరన్న అంశంపై గత వారం రోజులుగా చర్చలు జరిగాయి. ముఖ్యంగా పలువురు సీనియర్ నేతలు ఈ పదవి కోసం పోటీపడ్డారు. వీరందరినీ తోసిరాజనీ, ఢిల్లీ పెద్దలతో మంచి సన్నిహిత సంబంధాలు కలిగివున్న కేంద్ర మాజీ మంత్రి వి.నారాయణ స్వామిని సీఎం పదవి వరించింది. 
 
ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై పుదుచ్చేరిలో కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలతో శనివారం సమావేశం జరిగింది. ఇందులో ఢిల్లీ దూతలుగా మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, ముకుల్ వాస్నిక్‌లు హాజరయ్యారు. ఇందులో సోనియా మాటగా నారాయణ స్వామి పేరును ప్రతిపాదించారు. దీంతో ఆయన కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.