గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR

ఉరిశిక్షలతో నేరాలను ఆపగలమా : వరుణ్ గాంధీ ప్రశ్న

దేశంలో ఉరిశిక్షల అమలుపై అనేక మంది అనేక రకాలైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఉరిశిక్షలను సమర్థిస్తుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఉరిశిక్షల అమలు వల్ల నేరాలకు అడ్డుకట్ట వేయగలమా అని ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. 
 
తాజాగా, మరణశిక్షపై లా కమిషన్‌ నిర్వహించిన చర్చాగోష్టి కార్యక్రమం జరిగింది. ఇందులో బీజేపీ యువనేత వరుణ్ గాంధీ పాల్గొని తన మనస్సులోని మాటను వెల్లడించారు. మరణదండన ఖచ్చితంగా శిక్షే అయినా.. దీన్ని అమలుపరచడం ద్వారా ఇతర నేరగాళ్లు అలాంటి తీవ్ర నేరాలకు పాల్పడకుండా నిరోధించలేమన్నారు. 
 
'అటు బెయిలూ రాకుండా.... ఇటు పెరోల్‌పై విడుదలయ్యే ఆశా లేని పరిస్థితులలో యావజ్జీవం జైల్లో మగ్గిపోవడం కన్నా.... ఒక దోషికి తాను చేసిన నేరానికి 20 సెకన్లలో శాశ్వతంగా విముక్తి కలిగించే ఉరిశిక్ష ఇతరులను నేరాలకు పాల్పడకుండా ఆపగలుగుతుందా?' అని వరుణ్‌ ప్రశ్నించారు. 
 
'నా దృష్టిలో ఒక వ్యక్తిని అతను లేదా ఆమె బతికినంతకాలం జైల్లో ఉంచడం... ఉరి తీయడం కన్నా క్రూరమైన శిక్ష. అలాంటప్పుడు మనిషి జీవచ్ఛమవుతాడు. 20 సెకన్ల ఉరితో ఆ వ్యక్తి తాను చేసిన నేరాల నుంచి నైతికంగా విముక్తుడవుతాడు' అని వరుణ్‌ వ్యాఖ్యానించారు.