శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (03:48 IST)

కన్నతల్లి మళ్లీ పోన్ చేసి ఉంటే ఆ కుమారుడు జీవితానికే దూరం...

ఆ తెలుగు కుటుంబం అదృష్టం ఎంత బాగుందంటే.. ఒక క్షణకాలం వారి కుమారుడు దోపిడీ దొంగ చేతిలోని తుపాకి కాల్పులకు గురై శాశ్వతంగా దూరం కావల్సిన పరిస్థితిని తప్పించుకున్నారు. మద్యలో కట్ అయిన వీడియో కాల్‌ని తిరిగి చేయకుండా ఆ తల్లి పాటించిన సంయమనం ఒక నిండుప్రాణాన

ఆ తెలుగు కుటుంబం అదృష్టం ఎంత బాగుందంటే.. ఒక క్షణకాలం వారి కుమారుడు దోపిడీ దొంగ చేతిలోని తుపాకి కాల్పులకు గురై శాశ్వతంగా దూరం కావల్సిన పరిస్థితిని తప్పించుకున్నారు. మద్యలో కట్ అయిన వీడియో కాల్‌ని తిరిగి చేయకుండా ఆ తల్లి పాటించిన సంయమనం ఒక నిండుప్రాణాన్ని కాపాడింది. మరో భారతీయుడి లేదా తెలుగోడి ప్రాణాలు పోయి వార్తగా మిగిలిపోకుండా అతడు చిరంజీవి అయ్యాడు.
 
విషయానికి వస్తే.. శనివారం రాత్రి 8.40 గంటల ప్రాంతంలో (భారత కాలమాçనం ప్రకారం ఆదివారం ఉదయం 6గంటలు) అమెరికాలో ఓ స్టోర్స్‌లో ఉన్న తెలుగు విద్యార్థిని, ఓ ఆగంతకుడు ముసుగు ధరించి వచ్చి తుపాకీతో బెదిరించి డబ్బులు దోచుకున్నాడు. బాధితుడు సాయివరుణ్‌ తల్లిదండ్రులు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ కృష్ణకాలనీకి చెందినవారు. అదే సమయంలో కొడుకు యోగక్షేమాలు తెలుసుకోవడం కోసం మంచిర్యాల శ్రీరాంపురంలో ఉన్న తల్లిదండ్రులు వీడియో కాల్‌ చేశారు. ముందు తండ్రి మాట్లాడారు. అనంతరం కొడుకుతో మాట్లాడమని  భార్యకు ఫోన్‌ ఇచ్చి అతను  డ్యూటీకి వెళ్లి పోయాడు. తల్లి కొడుకుతో వీడియో కాల్‌ కొనసాగిస్తోంది. ఆ సమయంలో కొడుకు ఓ స్టోర్స్‌ కౌంటర్‌ వద్ద ఉండి మాట్లాడుతున్నాడు. కాసేపటికి ఆ తల్లికి గుండె ఆగిపోయేంత పనైంది.
 
ఓ ఆగంతకుడు వచ్చి కొడుకు తలపై రివాల్వర్‌ పెట్టాడు... చంపుతానని బెదిరిస్తున్నాడు... కొడుకు వణికిపోతున్నాడు... ఏం జరుగుందో అర్థంకాని పరిస్థితి... కొడుకును ఎవరతను అని అడిగే లోపే వీడియో కాల్‌ కట్‌ అయ్యింది. ‘‘చంపేస్తా.. కౌంటర్‌ ఓపెన్‌ చేయ్‌’’అంటూ బెదిరించడంతో చేసేది లేక కౌంటర్‌ తెరవగా.. దాంట్లో ఉన్న డబ్బును దోచుకున్నాడు. ఆ సమయంలో ఎవరితో మాట్లాడుతున్నావని ఆగంతకుడు.. అడగటంతో తాను ఇండియాలో ఉన్న తన తల్లిదండ్రులతో మాట్లాడుతున్నానని, తాను  విద్యార్థిననీ , తనను ఏమీ చేయవద్దని వేడుకున్నాడు. 
 
అయినా నిందితుడు... డబ్బులు తీసుకొంటూనే ‘‘క్యాష్‌ తీసుకొని చంపేస్తా’’అని బెదిరించాడు. ఇంతలో స్టోర్స్‌ ముందున్న పెట్రోల్‌బంక్‌ వద్దకు ఓ కారు రావడంతో శబ్దం విని వెంటనే ఆగంతకుడు పారిపోవడంతో ప్రాణాపాయం తప్పింది.  ఈ విషయాన్ని తర్వాత కుమారుడి ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడి ఘటనను వివరించి చెప్పారు. మీరు మళ్లీ తమ్మునికి ఫోన్‌ చేయకండి.. ఫోన్‌చేస్తే ఆగంతకుడు విసుగు చెంది ఏమైనా చేస్తాడు... నేను వెంటనే వెళ్తా అంటూ అమెరికాలోనే సమీపంలో ఉన్న అన్న చేసిన సూచన నిజంగానే ఆ తమ్ముడి ప్రాణాలు కాపాడింది.
 
ఒక వీడియో కాల్ ఇండియానుంచి తిరిగి చేయకపోవడం అనే యాధృచ్చిక ఘటన ఆ తల్లిదండ్రులకు కుమారుడి ప్రాణాన్ని దక్కించింది.