శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 25 మే 2016 (11:53 IST)

ప్రజా సంక్షేమ కూటమికి డీఎండీకే రాంరాం.. విజయకాంత్ అంతర్మథనం!

రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు కేంద్రబిందువుగా మారిన డీఎండీకే నేత కెప్టెన్‌ విజయ్‌కాంత్‌ కూడా పార్టీ ఓటమికి దారితీసిన పరిస్థితులపై అంతర్మథనం మొదలుపెట్టారు. ఆయన పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులతో, పార్టీ కీలక నేతలతో ఆయన సమావేశం ఏర్పాటు చేసి పార్టీ భవిష్యత్ గురించి చర్చించనున్నారు. ఈ సమావేశం కాస్త ఘాటుగానే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 
 
డీఎండీకేలో చాలామంది నేతలకు ప్రజాసంక్షేమ కూటమితో కలసి వెళ్లడం ఇష్టంలేదు, అయితే పార్టీ అగ్రనాయకత్వం పీడబ్ల్యూఎఫ్‌తో వెళ్లాలని నిర్ణయించుకుంది. ఎన్నికల్లో డీఎండీకే ఒక నిర్ణాయకశక్తిగా అవతరిస్తుందని భావించిన కెప్టెన్‌ ఆశలన్నీ ఫలితాల్లో తల్లకిందులయ్యాయి. 2011 ఎన్నికల్లో సత్తా చాటిన పార్టీ ఈ ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని మూటగట్టుకోవడానికి కారణాలు ఆ పార్టీ నేతలకు అంతు చిక్కడం లేదు. 
 
ప్రజలు పార్టీని ఈ స్థాయిలో తిరస్కరించడానికి కారణాలేమిటి? క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా మారాయి తదితర అనేక అంశాలపై కెప్టెన్‌ ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం విపక్ష పార్టీలన్నిటిలోనూ తమ పార్టీలకు పునరుత్తేజం ఎలా కలిగించాలనే దానిపై మేధోమథనం జరుగుతోంది. 
 
అదేసమయంలో ప్రజా సంక్షేమ కూటమి నుంచి బయటకు రావాలని విజయకాంత్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎన్నికల పొత్తుల్లో తప్పటడుకు వేసి పీడబ్ల్యూఎఫ్‌తో చేతులు కలపడం వల్లే తమ పార్టీ డకౌట్ అయినట్టు ఆ పార్టీ నేతలు ఇప్పటికే విజయకాంత్‌ దృష్టికి తీసుకెళ్లారు. అందువల్ల ఆ కూటమి నుంచి బయటకు రావాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.