గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (19:51 IST)

సెల్ఫీ పిచ్చి ముదిరిపోయింది.. కొండ చిలువ వద్ద సెల్ఫీ.. కాటేయబోయింది.. ఆపై...

సెల్ఫీ పిచ్చి బాగానే ముదిరిపోతోంది. సెల్ఫీ మోజులో ప్ర‌మాదక‌ర ప్ర‌దేశాల్లో, జంతువుల‌తో సెల్ఫీ దిగాల‌ని ప్ర‌య‌త్నించి ప్ర‌మాదాలు కొని తెచ్చుకుంటున్న ఘ‌ట‌న‌లు ఎన్నో వెలుగులోకి వ‌స్తున్నా యువ‌త అందులోంచి

సెల్ఫీ పిచ్చి బాగానే ముదిరిపోతోంది. సెల్ఫీ మోజులో ప్ర‌మాదక‌ర ప్ర‌దేశాల్లో, జంతువుల‌తో సెల్ఫీ దిగాల‌ని ప్ర‌య‌త్నించి ప్ర‌మాదాలు కొని తెచ్చుకుంటున్న ఘ‌ట‌న‌లు ఎన్నో వెలుగులోకి వ‌స్తున్నా యువ‌త అందులోంచి బ‌య‌ట‌ప‌డ‌లేక‌పోతున్నారు. అటువంటి ఘ‌ట‌నే తాజాగా రాజ‌స్థాన్‌లో చోటుచేసుకుంది. కొండచిలువతో సెల్ఫీకి ప్రయత్నించిన యువ‌కుడిపై అది దాడి చేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ రాష్ట్రంలోని మౌంట్‌అబూలోని ఓ హోటల్‌ పరిసరాల్లో ఈరోజు ఓ భారీ కొండచిలువ క‌నిపించింది. ఈ విష‌యాన్ని తెలుసుకున్న అట‌వీశాఖ అధికారులు అక్క‌డ‌కు చేరుకొని కొండ‌చిలువ‌ను ప‌ట్టుకున్నారు. ఆ కొండ చిలువను తీసుకెళ్తుండగా.. ఓ యువకుడు దాని వద్దకు వెళ్లి సెల్ఫీ దిగడానికి ప్ర‌య‌త్నించాడు. ఒక్క‌సారిగా అది స‌ద‌రు యువ‌కుడిపై దాడి చేసింది. వెంటనే స్పందించిన సిబ్బంది కొండ‌చిలువ‌ను అదుపు చేశారు. దీంతో యువకుడు దాని బారి నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. 
 
ఇదిలా ఉంటే, బీహార్ బస్సు ప్రమాద ప్రాంతంలో సెల్ఫీ తీసుకొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే భావనా ఝా చిక్కుల్లో పడింది. మధుబని ప్రాంతంలో బస్సు చెరువులో పడి 27 మంది వరకూ ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుల్లో ఆమె స్థానికులతో తీసుకున్న సెల్ఫీ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కానీ ఘటనా స్థలంలో సహాయక చర్యలు నిర్విహించిన యువకులు సెల్ఫీ తీసుకుంటామన్నారని.. వారి కోరికను మన్నించి వారితో ఫోటో తీసుకోవాల్సి వచ్చిందని భావనా ఝా వివరణ ఇచ్చారు. 
 
భావనా ఝాకు రాష్ట్ర రెవెన్యూ మంత్రి మదన్ మోహన్ ఝా ఆమెకు మద్దతునిచ్చారు. బస్సు ప్రమాదం తర్వాత ప్రజలకు గొప్ప సేవలను అందించిన భావనను ప్రశంసించాల్సింది పోయి... ఫోటోలను అడ్డుపెట్టుకొని రాజకీయ ప్రత్యర్థులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు.