గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 15 మార్చి 2017 (16:53 IST)

రెండాకుల గుర్తు మాది... ఈసీని కలిసిన పన్నీర్ సెల్వం... దినకరన్ ఎలా పోటీ చేస్తారు?

తమిళనాట అధికార అన్నాడీఎంకేలో మళ్లీ ముసలం మొదలైంది. ఆ పార్టీ అధికారిక ఎన్నికల గుర్తు రెండుకాకుల కోసం రెండు వర్గాల నేతలు పోటీ పడుతున్నారు. ఈ పంచాయతీని కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు తీసుకెళ్లారు.

తమిళనాట అధికార అన్నాడీఎంకేలో మళ్లీ ముసలం మొదలైంది. ఆ పార్టీ అధికారిక ఎన్నికల గుర్తు రెండుకాకుల కోసం రెండు వర్గాల నేతలు పోటీ పడుతున్నారు. ఈ పంచాయతీని కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు తీసుకెళ్లారు. రెండాకుల గుర్తు తమదేనని క్లెయిమ్ చేస్తూ అన్నాడీఎంకే తిరుగుబాటు నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బుధవారం ఎన్నికల కమిషన్‌ అధికారులను కలిశారు. 
 
తొమ్మిది మంది సభ్యులతో కూడిన ప్రతినిధి బృందానికి పన్నీర్ నేతృత్వం వహించారు. పార్టీ గుర్తు తమకే కేటాయించాలని కోరడంతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శిగా వీకే.శశికళ నియామకం చెల్లదని 61 పేజీల నివేదికను కూడా సమర్పించారు. జనరల్ సెక్రటరీ పదవికి మళ్లీ ఎన్నిక నిర్వహించాలని కూడా ఈసీని పన్నీర్ సెల్వం కోరారు. 
 
'పార్టీ నిబంధనల ప్రకారం పార్టీ నుంచి సభ్యులను బహిష్కరించడం, నియామకాలు చేపట్టే అధికారం ఆమె (శశికళ)కు లేదు. ఐదేళ్ల క్రితం ఆమె పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆమె ఎలా జనరల్ సెక్రటరీగా ఎన్నికవుతారు? పార్టీ రాజ్యాంగం ప్రకారం అనుకోని పరిస్థితుల్లో జనరల్ సెక్రటరీ పదవి ఖాళీ అయితే పార్టీలో రెండో సీనియర్ నేతను ఆ పదవికి ఎన్నుకోవాలి' అని పన్నీర్ తెలిపారు. 
 
అలాగే, అక్రమ ఆస్తుల కేసులో జైలుశిక్ష పడటంతో అన్నాడీఎంకే డిప్యూటీ సెక్రటరీగా టీటీవీ దినకరన్‌ను నియమించడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. పార్టీలో అలాంటి పదవేమీ లేదని ఆయన ఈసీ దృష్టికి తీసుకువచ్చారు. శశికళ కుటుంబం తప్పులు పునరావృతం చేస్తూ వచ్చిందని, పార్టీ, ప్రభుత్వం వారి చేతుల్లోకి వెళ్లకుండా తాను ఎంతో ప్రయత్నించానని పన్నీర్ తెలిపారు. 
 
మరోవైపు.. జ‌య‌ల‌లిత మ‌ర‌ణంతో ఖాళీ అయిన ఆర్కేన‌గ‌ర్ నియోజ‌క వ‌ర్గానికి వ‌చ్చేనెల 12న ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో అన్నాడీఎంకే నుంచి దిన‌క‌ర‌న్‌ను అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన అంశంపై ప‌న్నీర్ సెల్వం విమ‌ర్శ‌లు చేశారు. ఆ పార్టీ తరపున అభ్యర్థులను నిలిపే అర్హత శశికళకు లేదని అన్నారు. ఆయ‌న‌ను ఎన్నికల కమిషన్‌ అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అన్నాడీఎంకే పార్టీకి, దిన‌క‌ర‌న్‌కు ఎలాంటి సంబంధం లేదని పన్నీర్ సెల్వం గుర్తు చేశారు.