బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (03:18 IST)

మళ్లీ అదే ప్రాంతం.. అదే దాడి.. మన సైనిక బలగాలకు తీవ్ర నష్టం

భారత భద్రతా బలగాలపై సోమవారం మావోయిస్టులు జరిపిన అతి పెద్ద దాడిలో సీఆర్‌పీఎప్‌కు చెందిన 26 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా మరొక 7గురు గాయపడ్డారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో 10నుంచి 12 మంది నక్సల్స్ చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.

భారత భద్రతా బలగాలపై సోమవారం మావోయిస్టులు జరిపిన అతి పెద్ద దాడిలో సీఆర్‌పీఎప్‌కు చెందిన 26 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా మరొక 7గురు గాయపడ్డారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో 10నుంచి 12 మంది నక్సల్స్ చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.  సోమవారం మధ్యాహ్న 12. 55 నిమిషాలకు బుర్కాఫూల్ ప్రాంతంలో మావోయిస్టులు చేసిన ఆంబుష్ దాడిలో సీఆర్పీఎప్ పోలీసులు చిక్కుకున్నారు. ఇరుపక్షాల మధ్య మూడుగంటల పాటు జరిగిన కాల్పుల్లో 150 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బలగాలు చెల్లాచెదురు కాగా, బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని అడ్డుపెట్టుకున్న ఏడుగురు సీఆర్పీఎప్ పోలీసులు ప్రాణాలు దక్కించుకున్నారు. దాడికి పాల్పడిన 300 మంది మావోయిస్టుల్లో కొంతమంది బ్లాక్ క్యాట్ కమాండోల తరహా నల్ల యూనిఫారంలో కనిపించారని గాయపడ్డ జవానులు తెలిపారు.
 
రోడ్డు నిర్మాణ పనులకు సహాయంగా ఉంటున్న తమపైకి గ్రామీణులు కూడా ఆయుధాలు ధరించి వచ్చి దాడి చేశారని, మహిళా మావోయిస్టులు కూడా దాడిలో పాల్గొన్నారని గాయపడి ప్రాణాలు కాపాడుకున్న జవాన్ షేక్ మహమ్మద్ తెలిపారు. మావోయిస్టులు ఏకే-47, ఎస్ఎల్ఆర్, ఇన్సాస్ తదితర మారణాయుధాలు ధరించి వచ్చారన్నారు. తాము చేసిన కౌంటర్ దాడుల్లో కనీసం 12 మంది మావోయిస్టులు హతమైపోయారని, తానొక్కడినే ముగ్గురు మావోయిస్టులను కాల్చి చంపానని షేక్ చెప్పారు.
 
సుకుమా జిల్లాలో 50 రోజుల్లో మావోయిస్టులు చేసిన రెండో దాడి. ఈ సంవత్సరం మార్చిలో బెజ్జి గ్రామ సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్లో 12 మంది సీఆర్పీఎఫ్ బలగాలు చనిపోయారు. 2010లో మావోయిస్టు దాడిలో 76 మంది ప్రాణాలు కోల్పోయిన తాడిమెట్ల గ్రామానికి సోమవారం దాడి జరిగిన ప్రాంతం కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉండటం గమనార్హం.
 
2009 నుంచి ఈ ప్రాంతంలో సీఆర్పీఎప్ దళాలు వరుస నష్టాలకు గురవుతూ ఉండటం గమనార్హం. మావోయిస్టుల పీఎల్‌జీఏ బెటాలియన్ వన్ చీఫ్ హిద్మా నేతృత్వంలో సోమవారం దాడి జరిగినట్లు సమాచారం. ఈ బెటాలియన్ మావోయిస్టు దళాల్లోనే అత్యంత సాహసోపేత కేడర్‌తో కూడి ఉంటుంది.ఆంబుష్ సమయంలో ఈ బెటాలియన్ లోని ప్రతి ఒక్కరూ మారణాయుధాలతో దాడి చేస్తారు. ఈ బెటాలియన్లో అనేకమంది మహిళా కేడర్ కూడా ఉంటున్నారని సీఆర్పీఎఫ్ అధికారి తెలిపారు. ఈ బెటాలియన్ చీఫ్ హిద్మా గతంలో తాడిమెట్ల దాడిలోనూ పాల్గొన్నాడు. 
 
హిద్మాను పట్టుకోవడానికి అనేకసార్లు ప్రయత్నించామని, కానీ వందమంది సాయుధ కేడర్ రక్షణలో ఉండే హిద్మా నిరంతరం సంచారంలో ఉంటుండటంతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా బోర్డర్ అటవీ ప్రాంతంలో తిరుగుతుండటంతో భద్రతా బలగాలు అతడి జాడ పసిగట్టలేకపోతున్నాయని సీఆర్పీఎప్ అధికారి చెప్పారు.
 
మావోయిస్టుల దాడి ఎంత లోతట్టు ప్రాంతంలో జరిగిందంటే దట్టమైన అడవిలో చనిపోయిన సైనికుల మృతదేహాలను గుర్తించడానికే అయిదు గంటలు పట్టింది. ఎన్ కౌంటర్ జరిగన ప్రాంతంలోనే 11 మంది పోలీసుల మృతదేహాలు కనపడగా విస్తృతమైన కూంబింగ్ ఆపరేషన్ తర్వాత మరో 12 మృత దేహాలు కనుగొన్నామని అధికారి తెలిపారు.
 
సైనికుల కాల్పుల్లో 12 మందిదాకా హతమయ్యారని చెబుతున్నా, పోలీసులకు ఒక్క మావోయిస్టు శవం కూడా దొరకలేదు.