బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 27 ఆగస్టు 2014 (13:56 IST)

పవన్‌ కల్యాణ్‌లా రజనీకాంత్? సక్సెస్ మంత్రం మళ్లీ రిపీట్?

పవన్ కల్యాణ్. ఈ పేరే ప్రస్తుతం మారుమోగిపోతోంది. రాష్ట్ర  రాజకీయాల్లో పవన్ కల్యాణ్ రోల్ చాలా పరిణామాలకు దారితీసింది. టీడీపీ-బీజేపీ అలయన్స్ ఆంధ్రప్రదేశ్‌లో మంచి హిట్ కావడంతో ఇదే సక్సెస్ మంత్రాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడులోనూ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. 
 
ఇందులో భాగంగా మోడీ బీజేపీ లీడర్ అమిత్ షాను రంగంలోకి దించనున్నారు. అమిత్ షా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ఎలాగైనా రాజకీయాల్లీ లాక్కురావాలని అనుకుంటున్నారు. అలాగే రజనీకాంత్ కూడా దేవుడు నిర్ణయిస్తే రాజకీయాల్లో వస్తానని, పరోక్షంగా పొలిటికల్ ఎంట్రీపై కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో తమిళనాడులో నువ్వానేనా అంటూ తరచూ జుట్టుపట్టికొట్టుకునే డీఎంకే, ఏడీఎంకేలకు బీజేపీ చెక్ పెట్టేందుకు రజనీకాంత్‌ను పావుగా ఎంచుకోనుంది. ఈ క్రమంలో తమిళనాడులో బీజేపీని బలోపేతం చేసేందుకు కొత్త ఎంపికైన తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ చురుగ్గా చర్యలు తీసుకుంటున్నారు. పనిలో పనిగా పార్టీని పటిష్టం చేసేందుకు 7,000 కార్యకర్తలను ఆమె రంగంలోకి దించారు. 
 
ప్రస్తుతం రజనీకాంత్ లింగా షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్న నేపథ్యంలో కొచ్చాడియాన్ సినిమా ఫైనాన్షియల్‌గా ఫెయిల్యూర్ కావడంతో బీజేపీ చేయూత నిచ్చి బీజేపీలోకి లాక్కోవాలని చూస్తోంది. రజనీ కాంత్‌ను రాజకీయాల్లోకి లాగేందుకు ఇదే మంచి సమయమని బీజేపీ భావిస్తోంది. 
 
కాగా బీజేపీతో రజనీకాంత్ సంబంధాలు కూడా బలంగానే ఉన్నాయి. గతంలో మాజీ ప్రధాని వాజ్ పేయి నిధికి నదుల అనుసంధానం కోసం రజనీ కాంత్ రూ.కోటిని విరాళంగా ఇచ్చారు. అందుచేత రజనీకాంత్ కూడా తప్పకుండా రాజకీయాల్లోకి వస్తారని, బీజేపీలో చేరుతారని.. పవన్ కళ్యాణ్‌లా తమిళనాడు ప్రజలకు మార్పు తెస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
శ్రీలంక-తమిళనాడుకు మధ్య గల మత్స్యకారుల సమస్యను పరిష్కరించే దిశగా బీజేపీ అధినాయకత్వం చర్యలు తీసుకోనుండటంతో రజనీ కాంత్ సైతం ఆ పార్టీలో చేరే ఛాన్సుందని అంటున్నారు. ఇంకా రజనీ కాంత్ కోసం తాము గాలం వేయాల్సిన అవసరం లేదని.. ఆయన మావాడేనని సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. త్వరలో రజనీకాంత్ తెరపైనే కాకుండా రాజకీయాల్లోకి ఎప్పుడొస్తారని ప్రజలు వేచిచూస్తున్నారు.