బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 31 జులై 2014 (14:21 IST)

నట్వర్‌పై సోనియా ఫైర్: ఎవరో చంపుతామంటే భయపడేది లేదు!

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నట్వర్ సింగ్ వ్యాఖ్యలను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సీరియస్‌గా తీసుకున్నారు. తాను ఓ పుస్తకం రాస్తానని, అందులో అన్ని నిజాలు బయటపడతాయన్నారు. ఎవరో చంపుతారన్న వ్యాఖ్యలకు తాము భయపడటం ఎప్పుడో మానేశామని వెల్లడించారు.
 
నట్వర్ సింగ్ వ్యాఖ్యల పైన కాంగ్రెసు పార్టీ కూడా మండిపడింది. ఓ టీవీ ఇంటర్వ్యూలో నట్వర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రేరణే అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ అన్నారు. నట్వర్ సింగ్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అజయ్ మాకెన్ చెప్పారు. రాసిన పుస్తకాల పబ్లిసిటీ కోసం కొందరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మాకెన్ ఆరోపించారు.
 
కాగా, సోనియా గాంధీ ప్రధాని కాకుండా 2004లో ఆమె కుమారుడు, ప్రస్తుత కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అడ్డుకున్నారని ఒకప్పటి గాంధీ కుటుంబ విధేయుడు, మాజీ మంత్రి నట్వర్ సింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు చంపేస్తారనే భయంతో ప్రధాని పదవి చేపట్టవద్దని రాహుల్ గాంధీ సోనియాపై ఒత్తిడి తెచ్చారన్నారు. 
 
‘వన్‌ లైఫ్‌ ఈజ్‌ నాట్‌ ఎనఫ్‌' (ఒక జీవితం సరిపోదు) పేరిట నట్వర్‌సింగ్‌ తన స్వీయ చరిత్ర రాశారు. ఆ పుస్తకంలోని ఓ అంశాన్ని నట్వర్ సింగ్ ఓ టీవీ చానెల్‌తో పంచుకున్నారు.