శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (17:53 IST)

అబ్దుల్ కలాం మృతి... జీర్ణించుకోలేక యువకుడు ఆత్మహత్య..

మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కాలం మృతి జీర్ణయించుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకుని ప్రాణం తీసుకున్నాడు. చెన్నై నగర శివారులోని తిరుప్పోరూర్ సమీపంలో ఉన్న అల్లలూర్ ప్రాంతంలో ఉన్న ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న యువకుడు సుబ్రమణి (27). ఇతను కన్నగపట్టిలో అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. అతని ఇంటి తలుపు శుక్రవారం ఉదయం ఎంతకీ తెరచుకోలేదు. 
 
దీంతో ఇరుగుపొరుగువారు తలుపులు తట్టగా తెరవలేదు. వారు కిటికీలో నుంచి చూడగా సుబ్రమణి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృత దేహంగా వేలాడుతూ కనిపించాడు. దిగ్భ్రాంతి చెందిన వారు పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సుబ్రమణి మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసులు అతని గదిలో తనిఖీలు జరుపుగా అక్కడ ఒక లేఖ కనిపించింది. 
 
అందులో సుబ్రమణ్యం... 'నేను తీసుకున్న ఈ నిర్ణయానికి అమ్మ, నాన్న, అన్న, ప్రియమైన స్నేహితులు, అందరూ క్షమించాలి. కలాం అయ్యగారి మృతిని జీర్ణించుకోలేక పోతున్నాను. మన దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో తలఎత్తుకుని నిలబడేలా చేసిన వ్యక్తి కలాం అయ్యా. రామేశ్వరం ఇచ్చిన రత్నాన్ని కోల్పోయాం. అందరూ ఆయనకు అంజలి ఘటిస్తున్నారు. అయితే ఎవరూ చేయని విధంగా నా ప్రాణాన్నే నేను ఆయనకు అంజలిగా ఘటిస్తున్నాను. ఖచ్చితంగా నా అంజలిని ఆయన స్వీకరిస్తారని నమ్ముతున్నాను. రామేశ్వరం మట్టిలోకి వెళుతున్నాను.' అని ఆ లేఖలో రాసి ఉంది. 
 
పోలీసులు కేసు నమోదు చేసుకుని, సుబ్రమణి మృతికి ఇదే కారణమా, లేక వేరేమైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.